ఆ చేప దొరికింది.. ఏదో కీడు జరుగుతుందంటూ జనంలో భయం..

మత్స్యకారుల వలకు అప్పుడప్పుడు చిత్రమైన చేపలు పడుతూ ఉంటాయి. సముద్రాల్లో చేపలు పట్టేవారికి ఒక్కోసారి అరుదైన చేపలు చిక్కుతుంటాయి. కొన్నిసార్లు అలాంటి చేపలు బోలెడన్ని డబ్బులు సంపాదించి పెడతాయి. కానీ చిలీలో ఇటీవల మత్స్యకారులకు చిక్కిన ఓ చేపను చూసి స్థానికులు హడలిపోతున్నారు. 16 అడుగుల పొడవుతో ఉన్న ఈ రకం చేపలు కనబడటం అపశకునమని.. భూకంపాలు, సునామీలు వంటి విపత్తుల సమయంలోనే ఇవి కనిపిస్తుంటాయని చెప్తున్నారు. ఈ విషయం ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

అరుదైన చేప.. అపశకునమని..
అదో పొడుగాటి చేప.. దాని పేరు ‘ఓర్ ఫిష్’. ఎక్కువగా సముద్రంలో అడుగున జీవిస్తూ ఉంటుంది. ఇటీవల చిలీలో మత్స్యకారులు 16 అడుగుల పొడవైన భారీ ‘ఓర్ ఫిష్’ను పట్టుకున్నారు. ఇదేదో బాగుందని వారు సంబరపడేలోపే.. జనంలో మాత్రం ఆందోళన మొదలైంది. ఇది కనిపిస్తే ఏదో ఆపద వస్తోందనడానికి సంకేతమని స్థానికులు చెప్తున్నారు. 2011లో జపాన్‌లో ఘోర భూకంపానికి ముందు ‘ఓర్ ఫిష్’లు తరచూ కనిపించాయని గుర్తు చేసుకుంటున్నారు. భూకంపాలు, సునామీల వంటి విపత్తులు రాబోతున్నాయన్న దానికి ఇది చిహ్నమని పేర్కొంటున్నారు. ఇప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని వణికిపోతున్నారు. ఇంతకుముందు మూడు నెలల కింద న్యూజిలాండ్‌ లోని బీచ్ లో ఒక ఓర్‌ ఫిష్‌ ను స్థానికులు గుర్తించారు.

అంత భయమేం అవసరం లేదు
‘ఓర్ ఫిష్’లు అరుదైన చేపల జాతి అని.. అవి ఎక్కువగా సముద్ర అడుగుభాగాన నివసిస్తాయని నిపుణులు చెప్తున్నారు. వాటికి ఆరోగ్యం బాగోలేనప్పుడు, బ్రీడింగ్ సమయంలో నీటి ఉపరితలానికి వస్తాయని.. ఆ క్రమంలో మత్స్య కారుల వలలకు చిక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు. అవి కనిపిస్తే భూకంపాలు, సునామీలు వస్తాయన్నది కేవలం ప్రజల నమ్మకం మాత్రమేనని.. సముద్రం అడుగున భూమి పొరల్లో కదలికలు వచ్చినప్పుడు ఆ అలజడి కారణంగా నీటి ఉపరితలానికి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

Rear Fish, Ocean, Ore fish, Earthquake, Tsunami, offbeat, International Fish

Leave A Reply

Your email address will not be published.