రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టిన వైసీపీ, టీడీపీ

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఏపీకి పట్టిన రాహుకేతువులని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. నిన్న కడపలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, బీజేపీపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ దేశానికి పట్టిన శనిగ్రహమని అన్నారు. రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన నంబర్ వన్ ద్రోహి అని మండిపడ్డారు. తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని చెప్పి దారుణంగా మోసం చేసిన బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందని తులసిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఈ రెండు పార్టీలు బీజేపీకి తాకట్టుపెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ కూడా వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్డీయే బానిసత్వాన్ని వీడాలని ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని జగన్ తాకట్టుపెట్టారన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం, వరద సాయం అందకపోవడం, ప్రత్యేక హోదా సాధించలేకపోవడం జగన్ వైఫల్యాలకు నిదర్శనమని శైలజానాథ్ అన్నారు.
Andhra Pradesh, NDA, Sake Sailajanath, Tulasi Reddy, AP Congress

Leave A Reply

Your email address will not be published.