జనసేనకు గంటా జై..?

విశాఖపట్టణం, జూలై 4, (ఎఫ్ బి తెలుగు): గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం ఎమ్మెల్యేయే అయినా ఇటీవలి కాలంలో తెలుగుదేశం కార్యక్రమాలలో ఎక్కడా కనిపించడం లేదు. ఆయన రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించిన సందర్భాలు ఈ మూడేళ్లలో ఎక్కడా కనిపించలేదు. అయితే హఠాత్తుగా ఇటీవల విశాఖలో జనసేన నేత జన్మదిన వేడుకలకు హాజరై ఒక్క సారి అందర్నీ ఆశ్చర్య పరిచారు. జనసేన నాయకుడు బోడేపల్లి జన్మదిన వేడుకల్లో గంటా సందడి చేశారు. దీంతో ఆయన తెలగుదేశం వీడి జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ ఊగాహానాలు వెల్లువెత్తుతున్నాయి.

అ కార్యక్రమానికి గంటాయే కాకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ ప్రసాద్ కూడా హాజరయ్యారు. ఇటీవలి కాలంలో ఇరువురూ కూడా తమ తమ సొంత పార్టీలకు దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ పరంగా జరిగిన ఏ కార్యక్రమాలకూ వీరు హాజరు కావడం లేదు. అటువంటి వీరిరువురూ జనసేన నేత జన్మదిన వేడుకలకు హాజరు కావడం రాజకీయ ఊహాగానాలకు తావిచ్చింది.మల్ల విజయప్రసాద్ వైసీపీని వీడి జనసేన తీర్ఫం పుచ్చుకోనున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. వైసీపీలో ఆయనకు ఇసుమంతైనా గుర్తింపు లేకపోవడం, ఆయనను విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తప్పించడంతో వైసీపీలో ఆయనను పక్కన పెట్టారన్నది నిర్ధారణ అయ్యింది.

దీంతో ఇటీవల కొంత కాలం నుంచీ మౌనంగా ఉన్న మల్ల విజయ ప్రసాద్ జనసేన వైపు చూస్తున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా విషయం వేరు. గత మూడేళ్లుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఆయనను పక్కన పెట్టారు.పార్టీలో ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వడం లేదు. పార్టీ పరంగా జరిగిన ఏ కార్యక్రమంలోనూ కూడా గంటా పాలు పంచుకోలేదు. దీంతో ఆయన తెలుగుదేశంలో ఉన్నా లేనట్టే అన్నట్లుగా ఆయన పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో ఆయన జనసేన వైపు చూపు సారిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.