వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరికి విజయమ్మ డౌటేనా..?

గుంటూరు, జూలై 4, (ఎఫ్ బి తెలుగు): అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జూలై 8, 9 తేదీల్లో జరగనుంది. అందుకు సన్నాహాలు మొదలైనాయి. అయితే ఈ ప్లీనరీని సక్సెస్ చేసేందుకు పార్టీలోని కీలక నేతలంతా రంగంలోకి దిగారు. భారీగా నిర్వహించే ఈ ప్లీనరీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హాజరవుతారా? ఆమె ఆ పదవిలోనే కొనసాగుతారా? లేక ఆ పదవికి రాజీనామా చేసి.. మళ్లీ కుమార్తె వైయస్ షర్మిల వద్దకు వెళ్లిపోతారా? అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో హాట్‌హాట్‌గా నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌కి ఆయన తల్లితో చెల్లితో బాగా గ్యాప్ పెరిగింది. ఇందుకు తార్కానమే షర్మిల వైయస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం, తల్లి విజయమ్మ ఆమెతోనే ఉండటం. వైఎస్సార్టీపీ అధ్యక్షరాలిగా షర్మిల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఆమె పాదయాత్ర ఇటీవలే వంద రోజులు సైతం పూర్తి చేసుకొంది.

అయితే తెలంగాణలో పార్టీ వద్దన్నా వినకుండా పార్టీ పెట్టడంపై సీఎం జగన్ .. రగిలిపోతున్నారని అప్పట్లోనే వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైఎస్సార్ టీపీ కారణంగానే జగన్‌కు విజయమ్మ, షర్మిలలతో సంబంధాలు చెడ్డాయని కూడా అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఈనెల 8,9 తేదీలలో జరగనున్న వైసీపీ ప్లీనరీకి వైయస్ విజయమ్మ అయినా హజరవుతారా? అన్న సందేహాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నాయి. 2017లో నాడు ప్రతిపక్ష పార్టీ హోదాలో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు.. అదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలంటే.. జగన్ పరిపాలన ముచ్చటగా మూడేళ్లు నిండిన తర్వాత నిర్వహిస్తున్నది.

విపక్ష నేతగా జగన్ ఎప్పుడు దీక్షలు చేసినా.. ఎప్పుడు సభలు, సమావేశాలు నిర్వహించినా.. విజయమ్మ.. షర్మిల జగన్ కు అండగా నిలిచారు.ముగ్గురూ ఒకే వేదికపై కూర్చుని ముచ్చట్లాడుకునే వారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముందు ముందు కూడా ఉంటుందన్న నమ్మకం లేదు. అక్రమాస్తుల కేసులో జగన్ చంచల్ గూడ జైల్లో ఉన్న సమయంలో.. జగనన్న వదిలిన బాణాన్నంటూ షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేశారు. అలాగే రాజన్న రాజ్యం కోసం.. తన బిడ్డకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ.. ఎన్నికల ప్రచారంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ కోరారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కూడా వైసీపీతో కానీ, అధినేత జగన్ తో కానీ కనీసం కలవడానికి ఇష్టపడటం లేదు. జగన్ తో తల్లీ, సోదరిల విభేదాలు పార్టీకి ఒక విధంగా పెద్ద దెబ్బేనని వైసీపీ వర్గాలే అంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.