ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు ఇవ్వండి..: జగన్

ఏపీలో భారీ వర్షాలు ప్రజా జీవితాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, గోదావరికి ఈ ఏడాది ముందస్తుగానే వరదలు వచ్చాయని చెప్పారు. ఈ నెలలోనే 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని తెలిపారు. రేపు ఉదయానికి వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటం కూడా గోదావరిలో వరద ప్రవాహం పెరగడానికి కారణమని అన్నారు.

భారీ వర్షాలు, వరద నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జగన్ చెప్పారు. ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదని అన్నారు. కంట్రోల్ రూమ్స్ సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. కూనవరం, చింతూరుల్లో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు… అమలాపురం, వేలూరుపాడు, కూనవరం, వీఆర్ పురంలలో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని తెలిపారు.

సహాయక శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు బాగుండాలని సీఎం సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు, మంచి ఆహారం అందించాలని చెప్పారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు ఇవ్వాలని… తక్షణ సాయంగా ఈ డబ్బు వారికి ఉపయోగపడుతుందని చెప్పారు. వరదల కారణంగా జరిగే నష్టాలపై రోజువారీ నివేదికలు పంపాలని ఆదేశించారు.
Tags: Jagan YSRCP, Floods Compensation

Leave A Reply

Your email address will not be published.