కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన జనసైనికులు.. తీవ్ర ఉద్రిక్తత!

గుడివాడ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో రోడ్లు పూర్తిగా పాడయ్యాయని, వాటిని మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తూ జనసేన శ్రేణులు కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.

ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, జనసేన శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని… తమని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు.

కొడాలి నాని ఇంటికి వెళ్లే దారి కూడా గోతులమయంగా ఉందని.. మాజీ మంత్రి ఇంటికి వెళ్లే దారే ఇలా ఉంటే.. ఇతర దారుల పరిస్థితి ఏమిటని వారు మండిపడ్డారు. సీఎం జగన్ వాస్తవాలను గుర్తించాలని నినదించారు. రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.