ఎస్సైని క‌త్తితో పొడిచిన దొంగ‌లు..

శాంతి భ‌ద్ర‌తల ప‌రిర‌క్ష‌ణ‌లో ప్రాణాలు ప‌ణంగా పెట్టి విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసుల‌పై వ‌రుస దాడులు జ‌రుగుతుండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. అది కూడా ఎక్క‌డో మారుమూల ప‌ల్లెల్లోనో, లేదంటే నిర్మానుష్యంగా ఉండే అట‌వీ ప్రాంతాల్లోనో ఈ దాడులు జ‌ర‌గ‌డం లేదు. కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయి.. రాత్రి, ప‌గ‌లు అన్న తేడా లేకుండా నిత్యం జ‌న సంచారం క‌లిగిన హైద‌రాబాద్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని మారేడుప‌ల్లిలో విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఓ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను చిల్ల‌ర దొంగ‌లు ఏకంగా కత్తితో పొడిచేసి ప‌రార‌య్యారు. సికింద్రాబాద్ ప‌రిధిలోని మారేడుప‌ల్లిలో మంగ‌ళవారం అర్థరాత్రి దాటిన త‌ర్వాత చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో మారేడుప‌ల్లి ఎస్సై విన‌య్ కుమార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ప్ర‌స్తుతం ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే… మంగ‌ళ‌వారం రాత్రి మారేడుప‌ల్లి ప‌రిధిలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న విన‌య్ కుమార్‌… అటుగా బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు యువ‌కుల‌ను ఆపారు. వారి వివ‌రాలు తెలుసుకునే య‌త్నం చేస్తుండ‌గానే… ఆయ‌న‌పై వారు క‌త్తితో క‌డుపులో పొడిచి ప‌రార‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్ర ర‌క్త‌స్రావం అయిన విన‌య్ కుమార్‌ను పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఇదిలా ఉంటే… ఎస్సైనే క‌త్తితో పొడిచి ప‌రారైన నిందితుల కోసం పోలీసులు వేట మొద‌లెట్టారు. బుధ‌వారం ఉద‌యానికే నిందితుల‌ను గుర్తించారు. లంగ‌ర్ హౌస్‌కు చెందిన ప‌వ‌న్‌, బాలాజీ న‌గ‌ర్‌కు చెందిన సంజ‌య్‌లుగా నిందితుల‌ను గుర్తించారు. వీరిద్ద‌రిపైనా న‌గ‌రంలోని ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో దొంగ‌త‌నం కేసులు న‌మోదైన‌ట్లు తేలింది. ఎస్సైపై దాడి చేసిన వెంట‌నే నిందితులిద్ద‌రూ ప‌రార‌య్యారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.