యూట్యూబ్ లో చూసి వైన్ తయారుచేసిన కేరళ బాలుడు… అది తాగి ఆసుపత్రిపాలైన మరో బాలుడు

గుండుసూది నుంచి గొడ్డలివరకు, సీమటపాకాయ నుంచి బాంబుల తయారీ వరకు ఏదైనా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చంటే అతిశయోక్తి కాదు! కేరళలో 12 ఏళ్ల బాలుడు కూడా సొంతంగా వైన్ తయారుచేయడం కోసం యూట్యూబ్ ను ఆశ్రయించాడు. అందులో చూపిన విధంగా ద్రాక్ష పండ్లతో వైన్ తయారుచేశాడు. అయితే అది వికటించింది. ఆ వైన్ ను తాగిన మరో బాలుడు ఆసుపత్రిపాలయ్యాడు. కేరళలోని చిరాయింకీళు పట్టణంలో ఈ ఘటన జరిగింది. యూట్యూబ్ చలవతో వైన్ తయారుచేసిన బాలుడు మరుసటిరోజు ఉదయం దాన్ని తాను చదివే గవర్నమెంట్ హైస్కూల్ కు తీసుకువచ్చాడు.

తాను సొంతంగా వైన్ తయారుచేశానని గొప్పగా చెబుతూ ఫ్రెండ్స్ ను తాగమని ప్రోత్సహించాడు. అది తాగిన వారిలో ఓ బాలుడు ఒంట్లో వికారంగా ఉందని చెబుతూ, వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. దాంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం అందరికీ తెలియడంతో, ఆసుపత్రిపాలైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసులు పాఠశాల వద్దకు వచ్చి టీచర్ల నుంచి వివరాలు సేకరించారు. వైన్ తయారుచేసిన బాలుడి తల్లిదండ్రులకు విషయం తెలిపారు. బాలుడు సొంతంగా తయారుచేసిన వైన్ ఎలాంటి పరిణామాలకు దారితీసిందో వివరించారు.

Leave A Reply

Your email address will not be published.