రాష్ట్రపతి బరిలో ఇద్దరే

న్యూఢిల్లీ, జూలై 4 (ఎఫ్ బి తెలుగు): రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరే నిలిచారు నామినేషన్ విత్ డ్రా చివరి రోజున రాష్ట్రపతి పదవి రేసులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపతి ముర్ముతో పాటు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇద్దరు మాత్రమే నిలిచారు. మొత్తం 115 నామినేషన్లు దాఖలు అయితే వాటిలో 107 నామినేషన్లు సరైన విధంగా లేకపోవడంతో ఎన్నికల అధికారులు వీటిని తిరస్కరించారు. ముర్ము, యశ్వంత్ సిన్హాలు ఇద్దరు నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.జూన్ 29 వరకు 94 మంది వ్యక్తులకు సంబంధించి 115 నామినేషన్లు వచ్చాయని.. వాటిలో 107 నామినేషన్లు సరైన ఫార్మాట్ లో లేకపోవడంతో తిరస్కరించామని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ శనివారం వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం జూన్ 15న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.

మొత్తం 115 నామినేషన్లలో 26 మందికి సంబంధించిన 28 నామినేషన్లు, నామినేషన్ వేసే సమయంలోనే తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 72 మంది అభ్యర్థుల 87 నామినేషన్లకు సంబంధించి అభ్యర్థిత్వాన్ని బలపరిచే ప్రతినిధులు, మద్దతు తెలిపే వారి సంఖ్య సరిగ్గా లేకపోవడంతో వాటిని కూడా తిరస్కరించారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్త మద్దతు కూడగట్టేందుకు రాష్ట్రపతి అభ్యర్థులు ద్రౌపతి ముర్ము, యశ్వంత్ సిన్హా వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు.

శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన యశ్వంత్ సిన్హాకు ఘనస్వాగతం పలికారు సీఎం కేసీఆర్. ఇక ద్రౌపతి ముర్ముకు వివిధ పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఎన్డీయే కూటమిలో లేనటువంటి బీజేడీ, వైసీపీలతో పాటు శిరోమణి అకాళీదళ్, బీఎస్పీ పార్టీల నుంచి మద్దతు లభించింది. మరోవైపు దేవేగౌడ కూడా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపతి ముర్ము గెలుపు లాంఛనమే అని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.