గుజరాత్ యువరాజు మన్వేంద్ర సింగ్ ‘గే’ వివాహం!

Prince Manvendra Singh Gay Marriage గుజరాత్‌కు చెందిన స్వలింగ సంపర్కుడైన యువరాజు మన్వేంద్ర సింగ్ గోహిల్ స్వలింగ సంపర్కుడిని వివాహం చేసుకున్నారు. ఈ నెల 6న ఒహియోలోని కొలంబస్ చర్చిలో ఈ వివాహం ఘనంగా జరిగింది. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న స్వలింగ సంపర్కుడైన డీఆండ్రీ రిచర్డ్‌సన్‌ను వివాహం చేసుకున్నట్టు మన్వేంద్ర సింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తమ పెళ్లి ఫొటోలు, వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలను కూడా షేర్ చేశారు.

మాజీ మహారాజు రఘువీర్ సింగ్ రాజేంద్రసింగ్-రాజ్‌పిప్లా రాచరిక రాష్ట్ర మాజీ రాణి రుక్మిణీ దేవి కుమారుడే మన్వేంద్ర సింగ్. ముంబైలోని స్కాట్స్ స్కూల్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. ముంబై మిథిబాయి కాలేజీ క్యాంపస్‌లో ఉన్న అమృత్‌బెన్ జీవన్‌లాల్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. తన వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా లేదని, ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశానంటూ ఒకసారి పశ్చాత్తాపపడ్డారు.

మన్వేంద్ర సింగ్ 2006లో స్థానిక వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ.. తనను తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. తద్వారా దేశంలోని రాజవంశంలో అలా ప్రకటించుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు. అప్పట్లో ఆయన ప్రకటన తీవ్ర చర్చకు కారణమైంది. 2018లో సుప్రీంకోర్టు సెక్షన్ 377ని రద్దు చేయడంతో రాజ్‌పిప్లాలో స్వలింగ సంపర్కుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేశారు. దానికి అమెరికన్ రచయిత జనేత్ పేరు పెట్టారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్వలింగ సంపర్కుల ఆశ్రమంగా ఇది రికార్డులకెక్కింది. మన్వేంద్ర 2007లో ప్రసిద్ధ అమెరికన్ షో ‘ఓఫ్రా విన్‌ఫ్రే’లో పాల్గొన్నారు. 2009లో బీబీసీ ‘అండర్ కవర్ ప్రిన్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.