పెరుగుతున్న బియ్యం ధరలు

చాలా కాలంగా బియ్యం ధరలు స్థిరంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. కిలోకు 4-5 రూపాయల వ్యత్యాసంతో బియ్యం ధరలు మార్కెట్లో పలికేవి. కానీ, పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. జూన్ నుంచి చూస్తే ఉత్తరాదిన అన్ని రకాల బియ్యం ధరలు 30 శాతం వరకు పెరిగినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా నుంచి బియ్యానికి డిమాండ్ పెరిగింది. అదే సమయంలో పైగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరి సాగు తగ్గింది. ఖరీఫ్ సీజన్ లో జులై 29 వరకు ఉన్న గణాంకాలను చూస్తే వరి సాగు దేశవ్యాప్తంగా 13.3 శాతం తక్కువగా నమోదైంది. అంతక్రితం ఏడాది జులై 29 నాటికి చూసినప్పుడు ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో వర్షాలు బలహీనంగా ఉన్నాయని చెప్పి రైతులు తక్కువ సాగు చేశారు. అలాగే, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోనూ వరి సాగు గతేడాదితో పోలిస్తే తగ్గింది. దీంతో ఈ ఏడాది వరి దిగుబడి తగ్గుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి.

బంగ్లాదేశ్ బియ్యం దిగుమతులను పెంచింది. దీంతో కర్నూలు సోనా మసూరి రకం ధరలు 20 శాతం వరకు పెరిగినట్టు రైస్ ఎగుమతిదారుల సమాఖ్య ప్రెసిడెంట్ బీవీ కృష్ణారావు తెలిపారు. ‘‘అన్ని రకాల రైస్ వెరైటీల ధరలు 30 శాతం వరకు పెరిగాయి. రత్నా రకం బియ్యం రూ.26 ఉంటే, రూ.33కు పెరిగింది. బాస్మతి బియ్యం ధరలు రూ.62 నుంచి 80కు పెరిగాయి. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా నుంచి వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది’’ అని కోల్ కతాకు చెందిన తిరుపతి అగ్రి ట్రేడ్ సీఈవో సూరజ్ అగర్వాల్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.