భారత రాష్ట్రపతులు జులై 25నే ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తారో తెలుసా..?

భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం (జులై 25వ తేదీన) ప్రమాణ స్వీకారం చేశారు. భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ద్రౌపది ముర్ము ఒక్కరే కాదు.. చాలా మంది రాష్ట్రపతులు జులై 25వ తేదీనే పదవీ స్వీకార ప్రమాణం చేసి, రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.

ఎలాంటి నిబంధనా లేకపోయినా..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తాజాగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము వరకు.. భారత దేశానికి 15 మంది రాష్ట్రపతులుగా పనిచేశారు. ఇందులో 11 మంది జులై 25వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. నిజానికి కచ్చితంగా ఈ తేదీనే ప్రమాణ స్వీకారం చేయాలన్న నిబంధన ఏదీ, ఎక్కడా లేదు. అయినా 1977 నుంచీ ఇదొక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.

నీలం సంజీవరెడ్డితో మొదలై..

  • భారత ప్రప్రథమ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ తో పాటు ఆయన తర్వాత రాష్ట్రపతులుగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నలుగురూ వేర్వేరు తేదీల్లో ప్రమాణ స్వీకారం చేశారు.
  • భారత్ గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952లో జరిగిన తొలి రాష్ట్రపతి ఎన్నికల్లో, తర్వాత 1957 ఎన్నికల్లో ఆయనే గెలిచి జనవరి 26వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.
  • సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 మే 13న ప్రమాణ స్వీకారం చేశారు. 1967 మే 13న జాకీర్ హుస్సేన్ బాధ్యతలు చేపట్టారు. అయితే జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఇద్దరూ పదవిలో ఉండగా మరణించడంతో తర్వాత రాష్ట్రపతి పదవికి మధ్యంతర ఎన్నికలు జరిగాయి.
  • 1977 జులై 25న నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆనాటి నుంచి వరుసగా జ్ఞానీ జైల్ సింగ్, ఆర్. వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాథ్ కోవింద్ తోపాటు తాజాగా ద్రౌపది ముర్ము కూడా ఇదే తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.
  • వీరంతా కూడా రాష్ట్రపతులుగా తమ పూర్తి పదవీకాలం కొనసాగడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.