మన ఊరు-మన బడిని పక్కాగా అమలు చేయాలి

ప్రతిపాదిత నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
జిల్లా అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : సీఎం కేసీఆర్‌ ‌ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు విద్యా, ఇంజనీరింగ్‌ ‌శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత బడి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి హరీశ్‌ ‌రావు సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌, ‌జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌ ‌రెడ్డి, మండలాల విద్యాధికారులు, పంచాయతీ రాజ్‌ ‌శాఖ అధికారులతో సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునికీకరణ, మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా సమున్నత లక్ష్యంతో చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమాన్ని విద్యా, ఇంజనీరింగ్‌ ‌శాఖ, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల వారీగా పాఠశాలల్లో అదనపు గదులు, వసతులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

స్కూల్స్ ఎం‌పికలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? పథకం అమలుపై అధికారుల చర్యలేంటి? అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది? ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా? వంటి పలు అంశాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిద్ధిపేట అర్బన్‌, ‌సిద్ధిపేట రూరల్‌, ‌నారాయణరావుపేట, చిన్నకోడూర్‌, ‌నంగునూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన పాఠశాలల తరగతి గదులను తొలగించి, మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, ప్రతి పాఠశాలలో నిరంతరం నీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, ‌మంచినీరు, ఫర్నీచర్‌, ‌ప్రహరీ గోడలు, వంట గది, అదనపు గదుల మరమ్మతులు, డిజిటల్‌ ‌వంటి అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

పాత భవనాలను ఆధునీకరణ చేసేలా చర్యలు చేపట్టాలని అధికార వర్గాలను మంత్రి సూచించారు. అదనపు నిధులు అవసరం ఉన్న పాఠశాలల జాబితా రూపొందించి ఉన్నతాధికారులకు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశించారు. మనఊరు-మనబడిలో భాగంగా 2, 3 నెలల్లో ప్రతీ పాఠశాలలో నాణ్యత ప్రమాణాలతో కూడిన నిర్మాణాలు జిల్లాలోని అన్నీ పాఠశాలలో పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.