అసలు ‘క్లౌడ్ బరస్ట్’ అంటే ఏంటి..? ఎందుకు వస్తుంది?

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేని భారీ వర్షాలతో, గోదావరి ఉప్పొంగడం కారణంగా భద్రాచలం సహా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన సీఎం కేసీఆర్ ‘క్లౌడ్ బరస్ట్’ వెనుక విదేశీ కుట్ర ఉందేమో? అన్న సందేహం వ్యక్తం చేశారు. దీంతో క్లౌడ్ బరస్ట్ అనే పదం చర్చనీయాంశంగా మారిపోయింది. దీనిపట్ల చాలా మందిలో ఆసక్తి కూడా ఏర్పడింది. క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశీ కుట్ర అనే అంశాన్ని పక్కన పెడదాం. అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం.. ఒక ప్రాంతంలో ఒక గంట వ్యవధిలో 10 సెంటీమీటర్ల పరిమాణంలో వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ గా చెబుతారు. ‘‘వేడితో కూడిన రుతువవనాలు, చల్లటి పవనాలతో కలసినప్పుడు భారీ మేఘాలు ఏర్పడతాయి. నైసర్గిక స్వరూపం, భౌగోళిక కారణాల వల్ల కూడా ఇవి ఏర్పడవచ్చు’’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ముృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఇలాంటి పెద్ద మేఘాలే క్లౌడ్ బరస్ట్ కు కారణమవుతాయి.

క్లౌడ్ బరస్ట్ ఎందుకని.?
సంతృప్త మేఘాలు వర్షాన్ని కురిపించలేవు. వేడితో కూడిన గాలి వాటిని పైకి వెళ్లేలా చేస్తుంది. దీంతో అవి వర్షాన్ని కురిపించడానికి బదులు మరింతపైకి వెళతాయి. అంతిమంగా అంత బరువును నిలుపుకోలేక వర్షానికి కారణమవుతాయి. దీంతో భారీ వర్షం పడుతుంది. క్లౌడ్ బరస్ట్ అంటే మేఘాలు బద్దలైనంతగా వర్షించడమన్న అర్థంలో అలా పిలుస్తారు.

ముందే తెలుసుకోవచ్చా?
క్లౌడ్ బరస్ట్ ను ముందే ఊహించడం కష్టమైనదే. డాప్లర్ రాడార్ల సాయంతో తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, విశ్వంలో తక్కువ పరిమాణంలో, తక్కువ సమయం పాటు ఉండే క్లౌడ్ బరస్ట్ ను ముందే ఊహించడం కష్టమన్నది వాతావరణ శాఖ అభిప్రాయం.

Leave A Reply

Your email address will not be published.