స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు అదిరిపోవాలె…

  • టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌ ‌రావు
  • మంత్రి హరీష్‌రావు చొరవతో జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు

సిద్ధిపేట/జగదేవ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 13 : స్వాతంత్య్ర స్ఫూర్తి అందరికీ తెలియాలని, వాడవాడలా వజ్రోత్సవ వేడుకలు అదిరేలా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. ఈ నెల14(ఆదివారం)న సిద్ధిపేట కోమటి చెరువు-నెక్లెస్‌ ‌రోడ్డులో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమం జరగనున్నదని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌రోజాశర్మ, మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌కడవేర్గు మంజుల, మునిసిపల్‌  ‌కౌన్సిలర్లు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, మార్కెట్‌ ‌కమిటీ ఛైర్మన్లు, పిఏసిఎస్‌ ‌ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ ఛైర్మన్‌, ‌సర్పంచులు, ఎంపిటిసిలు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మొత్తం 4200 మందితో మంత్రి హరీష్‌రావు టెలి కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలలో భాగంగా కోమటిచెరువు-నెక్లెస్‌ ‌రోడ్డుపై 15 నిమిషాలు పెద్ద ఎత్తున్న బాణాసంచా పేల్చి సంబురాలు జరపనున్నట్లు, లేజర్‌ ‌షో నిర్వహించనున్నట్లు,  ప్రధానంగా నెక్లెస్‌ ‌రోడ్డు ప్రారంభోత్సవం సైతం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రముఖ డ్యాన్సర్‌ ‌వైష్ణవి విఘ్నేష్‌, ‌సాకేత్‌ ‌గ్రూప్‌ ‌ప్రముఖ గాయకులు, అలాగే సినీ నటుడు డిజె టిల్లు హీరో సిద్దు జోన్నలగడ్డ, జానపద గాయకురాలు కనకవ్వ రానున్నట్లు పేర్కొన్నారు. అలాగే 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకుని అన్నీ గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని కోరారు. 16న ఉదయం పదకొండున్నర గంటలకు ఎక్కడి వారు అక్కడే 58 సెకన్ల పాటు సాముహిక గీతాలాపన చేపట్టాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హరితహారంలో భాగంగా విరివిగా చెట్లు నాటాలని, పచ్చదనాన్ని పెంచి ప్రజలకు ఆరోగ్యాన్ని పంచాలన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి హరీష్‌ ‌రావు కోరారు.

మంత్రి హరీష్‌రావు చొరవతో జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రత్యేక చొరవతో సిద్ధిపేట జిల్లాలో జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే శనివారం సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ ‌మండలంలోని తీగుల్‌ ‌ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పిహెచ్‌సి)లో మండలంలో పని చేస్తున్న వర్కింగ్‌ ‌జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య ఆరోగ్య పరీక్షలు  చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ‌నివేదిత మాట్లాడుతూ….ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు చొరవతో తీగుల్‌ ‌ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలను నిర్వహించామన్నారు.

జర్నలిస్టులు నిత్యం వృత్తిరీత్యా బిజీ షెడ్యూల్‌లో ఉండి ఆరోగ్యాన్ని ఆజాగ్రత్త చేసుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ఆరోగ్యంగా ఉండాలని ఉచితంగా వైద్యం అందాలని జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య పరీక్షలు చేయాలని మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశాల మేరకు జర్నలిస్టులు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు చేపట్టామన్నారు. పరీక్షల తదనంతరం జర్నలిస్టులకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఉచితంగా చికిత్స అందిస్తామని తెలిపారు. అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. ఈ ఉచిత వైద్య పరీక్షల్లో విలేఖర్లు పర్షరాము, జహంగీర్‌, ‌వల్లీద్దీన్‌, ‌రామస్వామి, భాస్కర్‌, ‌పిహెచ్‌సి సిబ్బంది మధు, సబిత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.