భారీ వర్షాల నేపథ్యంలో కేసీఆర్ కీలక ఆదేశాలు

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించాలని చెప్పారు. తాను కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటానని తెలిపారు. రేపుకాని, ఎల్లుండి కాని తాను కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నేతలు ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని చెప్పారు. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 15న నిర్వహించాలనుకున్న రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నట్టు సీఎం తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి తదుపరి నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.
Tags: KCR meeting, TRS, Rains

Leave A Reply

Your email address will not be published.