విమానంలో వైద్యురాలిగా మారిపోయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్‌గా కొన‌సాగుతున్న త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ రాజ‌కీయాల్లోకి రాక‌ముందు వైద్యురాలిగా ప‌ని చేశార‌న్న విష‌యం తెలిసిందే. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక వైద్య వృత్తి చేప‌ట్టే తీరిక ఆమెకు చిక్క‌లేదు. తాజాగా ఆమె మ‌రోమారు వైద్యురాలిగా మారిపోయారు. అది కూడా గాల్లో విహ‌రిస్తున్న ఓ విమానంలో ఆమె వైద్యురాలిగా మారి అనారోగ్యంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఓ ప్ర‌యాణికుడికి చికిత్స అందించారు. త‌మిళిసై ప్రాథ‌మిక చికిత్స‌తతో అనారోగ్యం నుంచి తేరుకున్న ఆ ప్ర‌యాణికుడు ఆమెకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే… ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ బ‌య‌లుదేరిన ఇండిగో విమానంలో త‌మిళిసై ప్ర‌యాణిస్తున్నారు. ఉన్న‌ట్టుండి ఓ ప్ర‌యాణికుడు అస్వ‌స్థ‌త‌కు గురి కాగా… విమాన సిబ్బంది డాక్ట‌ర్లు ఎవ‌రైనా ఉన్నారా? అని అనౌన్స్‌మెంట్ చేశారు. దీంతో వెంట‌నే స్పందించిన త‌మిళిసై… నేరుగా బాధిత ప్ర‌యాణికుడి వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న‌కు ప్రాథ‌మిక వైద్యం చేశారు.

బాధితుడు కోలుకున్నాక‌… విమాన సిబ్బందికి ఆమె కొన్ని సూచ‌న‌లు చేశారు. విమానం బ‌య‌లుదేరే ముందే ప్ర‌యాణికుల్లో డాక్ట‌ర్లు ఉన్న‌ట్లయితే… ముందుగా చార్ట్‌లోనే విష‌యాన్ని తెలియ‌జేయాల‌ని ఆమె సూచించారు. అంతేకాకుండా అస్వస్థతకు గురైన వ్యక్తికి వెంటనే సీపీఆర్ చేయగలిగేలా సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కూడా ఆమె ఇండిగో సంస్థకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.