ఓలా, ఊబర్ ఒక్కటైపోతున్నాయా..?

ఓలా, ఊబర్.. ఈ రెండు మనదేశంలో ప్రధాన ట్యాక్సీ అగ్రిగేటర్ సంస్థలు. ఇప్పుడు ఈ రెండూ ఒక్కటైపోతున్నాయనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్ అగర్వాల్, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఊబర్ టాప్ ఎగ్జిక్యూటివ్ లతో భేటీ అయి చర్చలు నిర్వహించినట్టు కొన్ని వర్గాలు సమాచారాన్ని లీక్ చేశాయి. ఈ రెండు సంస్థల్లోనూ వాటాలు కలిగిన సాఫ్ట్ బ్యాంకు ఒత్తిడి మేరకు.. విలీనం విషయమై ఊబర్, ఓలా నాలుగేళ్ల క్రితం ఒకసారి చర్చలు నిర్వహించినా ఫలితం దక్కలేదు. భారత మార్కెట్లో తీవ్ర పోటీ పడే ఈ రెండు సంస్థలు లాభాలు పెంచుకోలేని పరిస్థితి, సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కరోనా తర్వాత క్యాబ్ సేవలకు డిమాండ్ తగ్గడంతో వీటి మధ్య పోటీ కూడా బలహీనపడింది. అయినా నిర్వహణ వ్యయాలు, ఇతరత్రా కారణాలతో పెద్దగా లాభాలు ఉండడం లేదు.

ఈ నేపథ్యంలో విలీనం విషయమై మరోసారి ఇరు సంస్థలు చర్చలు చేపట్టినట్టు ఆయా వర్గాలు వెల్లడించిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. విలీనమైతే ఒక్కటే సంస్థగా గుత్తాధిపత్యం చెలాయించడానికి అవకాశం లభిస్తుంది. కానీ ఊబర్, ఓలా విలీన వార్తలను ఓలా భవీష్ అగర్వాల్ ఖండించారు. తాము ఎంతో లాభాలతో, వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ఇతర కంపెనీలు భారత మార్కెట్ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటే స్వాగతిస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.