కోటిశ్వరుడికి దళిత బంధు

ఖమ్మం, జూన్ 5, (ఎఫ్ బి తెలుగు): హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు కొందరు దగాకోరుల చేతుల్లో చిక్కుకుంది. నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపాల్సిన పథకం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. పారదర్శకంగా ఎంపిక చేసి నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన పథకం అబాసు పాలవుతోంది. కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు తమకు ఇష్టం ఉన్నవారి పేర్లను జాబితాలో పొందుపరుస్తున్నారు. అంతేకాదు తమ అనుచరులు, బంధువులకు ఇప్పిస్తూ నిజమైన లబ్ధిదారులకు నష్టం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ కోటీశ్వరుడు కూడా దళితబంధు లబ్ధిదారుడు కావడం గమనార్హం. ఈ పథకాన్ని కొందరు కమీషన్ల రూపంలో ఇప్పిస్తుంటే.. మరికొన్ని చోట్లు తమ పార్టీ కండువా కప్పుకుంటేనే జాబితాలో పేరుంటుందని బెదిరింపులకు గురిచేస్తున్నారు. మొత్తంగా దళితబంధు దళారీబంధుగా మారింది. నిరుపేదలకు బతుకుల్లో వెలుగునిపాల్సిందిపోయి.. అధికారపార్టీ నేతల అనుచరులు, కార్యకర్తలకే వరంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఆయనో కోటీశ్వరుడు… నగరంలో పది ఇల్లులు, షాపింగ్ కాంప్లెక్స్ లు, ఇద్దరు పిల్లలూ డాక్టర్లు.. టీఆర్ఎస్ నాయకుడు. ఇంకేముంది అతను కూడా దళితబంధు లబ్ధిదారుడే. ఖమ్మం నియోజకవర్గంలో వంద మందిని ఎంపికచేశారు. రఘునాథపాలెం మండలంలోని ఈర్లపుడి గ్రామంలో 96 మందిని, ఖమ్మం నగరంలో నలుగురిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.

నగరంలో కూడా ఎంతోమంది అర్హులు ఉండగా ఆ కోటీశ్వరుడిని దళితబంధు పథకానికి ఎంపిక చేయటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలను గుర్తించి అందించాల్సిన పథకం టీఆర్ఎస్ నేతలకే అందించటం ఏంటని నిరుపేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులకు అండగా ఉంటాడని ఆయన్ను నాయకుడిని చేస్తే.. నిజమైన అర్హులకు అందాల్సిన పథకాలను ఆయనే మింగుతున్నాడని దళితులు మండిపడుతున్నారు.ఒక పథకం కోసం లబ్ధిదారులకు ఎంపిక చేస్తుంటే అన్ని గ్రామాలను పారదర్శకంగా ఎంపిక చేయాలి. కానీ ఉమ్మడి జిల్లాలో మాత్రం తమకు అనుకూలంగా ఉన్న గ్రామాలను మాత్రమే ఎంపిక చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఇతర పార్టీకి చెందిన గ్రామాలు, లేక అనుకూలంగా లేని ఊర్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాదు.. కొంతమంది నేతల మధ్య ఆధిపత్య పోరుతో కూడా గ్రామాలను ఎంపిక చేస్తున్నారు. పార్టీలోని తమ ప్రత్యర్థిని దెబ్బ తీసేందుకు తమ పలుకుబడితో తమకు అనుకూలంగా ఉన్న గ్రామాలనే ఎంపిక చేపించుకుంటున్నారు కొంతమంది నేతలు. నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలతో తమకు అన్యాయం చేస్తున్నారంటున్నారు నిజమైన దళితులు. ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెంలో చాలా గ్రామాల్లో ఎస్సీలు అధికంగా ఉన్నారు. కానీ ఈర్లపడి గ్రామంలోనే 96 మందిని ఎంపిక చేయటం పట్ల స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు.

కనీసం గ్రామానికో పది మంది లబ్ధిదారులను ఎంపిక చేసినా స్థానిక నాయకులు ఎస్సీకాలనీలో తిరిగేవారు. ఇప్పుడు ఆ కాలనీల్లో తిరగాలంటేనే జంకుతున్నారు.దళితబంధు ఎంపికలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు తమ అనుచరులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే పెద్దపేట వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వేరే పార్టీకి చెందిన వారిని అసలు లెక్కలోకే తీసుకోవడం లేదని, ఏ పార్టీకి చెందని నిరుపేదలను సైతం పథకానికి అర్హులుగా చూపడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిచోట్ల తమ పార్టీలోకి చేరితేనే దళితబంధు ఇప్పిస్తామని, లేకుంటే డబ్బలు రాకుండా చేస్తామంటూ గ్రామాల్లో బెదిరింపులకు దిగుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. స్థానిక నాయకుల మాటలతో ఏం చేయాలతో తెలియక కొందరు పార్టీ కండువాలు మారుస్తున్నారు.

ఇక తమ పేరు జాబితాలో లేనివారు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారుకొన్ని గ్రామాల్లో అయితే దళితబంధు దళారులు తయారయ్యారు. పలానా ఎమ్మెల్యేనో, పెద్ద నాయకుడో తెలుసని, దళితబంధుకు ఎంపిక చేపిస్తాం కమీషన్లు ఇవ్వాలంటూ అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా కొన్నిచోట్ల ముందే కమీషన్ తీసుకుంటేంటే.. ఇంకొన్నిచోట్ల లబ్ధిదారులకు డబ్బులు మంజూరయ్యాక ఎక్కువమొత్తంలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల కొంత మొత్తాన్ని ముందు వసూలు చేసుకుని, డబ్బులు పడ్డాకమరికొంత డబ్బు వసూలు చేస్తూ బ్రోకర్లలా వ్యవహరిస్తు్న్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తం నేతలు తమ అనుచరులనే జాబితాలో చేర్చుతుండడంతో దళారులు పుట్టుకొస్తు్న్నారు. కొన్ని చోట్ల మాత్రం దళితులే డబ్బులిస్తాం దళితబంధుకు ఎంపిక చేయడంటూ మోసపోతుండడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.