తైవాన్ పై ప్రతీకార చర్యలకు దిగిన చైనా

తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనను వ్యతిరేకిస్తున్న చైనా.. ప్రతీకార చర్యలకు దిగింది. ఇందుకు సంబంధించి చైనా కస్టమ్స్ విభాగం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తైవాన్ నుంచి చేపలు, పండ్ల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఈ ఉత్పత్తులపై గడిచిన ఏడాది కాలంలో పలు సందర్భాల్లో అధికంగా పురుగు మందుల అవశేషాలు బయటపడినట్టు తెలిపింది. అలాగే, జూన్ లో కొన్ని ఫ్రోజెన్ ఫిష్ ప్యాకేజీలపై కరోనా వైరస్ ను గుర్తించినట్టు పేర్కొంది.

ఇసుక ఎగుమతులను నిషేధిస్తున్నట్టు చైనా వాణిజ్య శాఖ ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేసింది. రాజకీయ అంశాలతో చైనా తరచుగా తైవాన్ సాగు రంగాన్ని లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించడం అలవాటే. నాన్సీ పెలోసీ పర్యటిస్తున్న తరుణంలోనూ దీన్నే ఆయుధంగా వాడుకుంది. తైవాన్ లో పండ్లను ఎక్కువగా సాగు చేసే ప్రాంతాలు అధ్యక్షుడు సాయ్ ఇంగ్ వెన్ కు చెందిన డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా నిలుస్తుంటాయి. డెమొక్రటిక్ పార్టీ తైవాన్ స్వాతంత్య్రాన్ని సమర్థిస్తుంటుంది. అందుకనే ఈ ప్రాంతాలను చైనా లక్ష్యం చేసుకుని ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.