ట్విట్టర్​పై ఎదురుదాడికి దిగిన ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పై ఎదురుదాడికి దిగారు. ఆ కంపెనీపై దావా వేశారు. 44 బిలియన్ డాలర్ల డీల్ తో ట్విట్టర్ కొనుగోలు చేయాలనుకున్న ప్రక్రియ నుంచి వెనక్కుతగ్గిన టెస్లా అధినేతపై ఆ కంపెనీ న్యాయ పోరాటం చేస్తోంది. ఏకంగా 164 పేజీలతో కూడిన పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై డెలావేర్ కోర్టు.. అక్టోబర్ 17వ తేదీ నుంచి ఐదు రోజుల విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ట్విట్టర్ న్యాయ పోరాటానికి ప్రతిగా మస్క్ కౌంటర్ దావా దాఖలు చేశారు. మరోవైపు ట్విట్టర్ కొనుగోలు డీల్ ను పూర్తి చేసేలా మస్క్ ను ఆదేశించాలని కోరుతూ ఆ కంపెనీకి చెందిన ఓ వాటాదారు కూడా కోర్టును ఆశ్రయించారు. కంపెనీ కొనుగోలు ప్రక్రియ నుంచి తప్పుకోవడం ద్వారా మస్క్ నిబంధనలు ఉల్లంఘించారని, తద్వారా ట్విట్టర్ కు కలిగిన నష్టాలకు ఆయన నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు.

టెస్లా అధినేత అయిన మస్క్ జూలై 8న ట్విట్టర్ కొనుగోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. తమ ఫ్లాట్ ఫామ్ లోని నకిలీ ఖాతాల సంఖ్యను తప్పుగా సూచించడం ద్వారా ట్విట్టర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దీన్ని ఖండించిన ట్విట్టర్ ఆయనపై దావా వేసింది. తప్పుదోవ పట్టించేందుకే నకిలీ ఖాతాలను ఆయన తెరపైకి తెచ్చారని విమర్శించింది. ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు ఒప్పందానికి మస్క్ కట్టుబడి ఉండాలని పేర్కొంది. మస్క్ ఈ డీల్ నుంచి వెనక్కి తగ్గిన తర్వాత తమ కంపెనీ షేర్లు పడిపోయాయని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.