ఐడియాల అడ్డా తెలంగాణ

  •  ఐటీకి కేరాఫ్‌ హైదరాబాదే
  • నాస్కాం జీసీసీ కాంక్లేవ్‌లో మంత్రి కేటీఆర్‌

ప్రపంచంలోని టాప్‌ 5 ఐటీ కంపెనీలు తమ రెండో అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసుకున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ప్రపంచ దిగ్గజ ఐటీ, ఫైనాన్స్‌ కంపెనీలు తమ సెంటర్లను భాగ్యనగరంలో ఏర్పాటు చేసుకునేందుకు అమితాసక్తిని చూపుతున్నాయన్నారు. హెచ్‌ఐసీసీలో జరిగిన నాస్కాం 12వ ఎడిషన్‌ జీసీసీ కాంక్లేవ్‌కు మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువారం ఈ 3 రోజుల కాంక్లేవ్‌ ముగియగా, ఈ కార్యక్రమంలో వివిధ నగరాలకు చెందిన ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐటీకి కేరాఫ్‌ హైదరాబాద్‌గా మారిందని, గత ఏడాది ఐటీ రంగంలో లక్షా 50వేల ఉద్యోగాలు కల్పించామని వివరించారు. ఈ క్రమంలోనే రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో దాదాపు 3 లక్షల వరకున్న ఉద్యోగాలు.. ఇప్పుడు 8 లక్షలకు పెరిగాయన్నారు.

మెరుగైన సదుపాయాలు
ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో మెరుగైన మౌలిక సదుపాయాల్ని కల్పించామని, గంటలోపే ఇక్కడకు చేరుకునేలా రవాణా సౌకర్యాలున్నాయన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు 70 కిలోమీటర్ల మెట్రోరైలు కనెక్టివిటీ, సౌకర్యవంతమైన అంతర్గత రహదారులు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డు నుంచి కోకాపేట వరకు ఎలివేటెడ్‌ బస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌కు ప్రణాళికలు రూపొందించినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నిజానికి బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య, చెన్నైలో తేమ ఎక్కువ, ముంబై ఖర్చుతో కూడుకున్న నగరాలన్న మంత్రి కేటీఆర్‌.. కొత్త సంస్థలు ఏర్పాటు చేయడానికి ఇప్పుడు హైదరాబాదే అద్భుతమైన కేంద్రంగా మారిందన్నారు.

స్టార్టప్‌లకు చేయూత
టీహబ్‌, వీహబ్‌ ద్వారా స్టార్టప్‌లకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌నూ ఏర్పాటు చేశామని తెలిపారు. టాస్క్‌ ద్వారా డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచుతున్నామని చెప్పారు. ముఖ్యంగా టీఎస్‌ఐపాస్‌తో పరిశ్రమలకు 15 రోజుల్లో అన్నిరకాల అనుమతులు వస్తున్నాయని వివరించారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, యాపిల్‌, వెల్స్‌ఫార్గో, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, హెచ్‌ఎస్‌బీసీ, బ్రాడ్రిడ్జ్‌, ఏడీపీ, జేపీ మోర్గాన్‌, నోవార్టిస్‌, డెలాయిట్‌ తదితర సంస్థలు ఇప్పటికే వారివారి గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లుగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాయన్నారు.

ప్రగతిదాయక విధానాలు
తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం, విధానాలు అమల్లో ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌తోపాటు ప్రధాన నగరాల అభివృద్ధిపై తాము ఫోకస్‌ చేశామని, ప్రజా రవాణాను గతంలో ఎన్నడూ లేనివిధంగా మెరుగుపరిచామని వెల్లడించారు. గడిచిన 8 ఏండ్లలో హైదరాబాద్‌ నగరంలో 30 ఫ్లై ఓవర్లు కట్టడం ఓ చరిత్ర అని స్పష్టం చేశారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు, అంతరాయం లేని కరెంట్‌ ఇస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. హైదరాబాద్‌.. దక్షిణాదికి, ఉత్తరాదికి ముఖద్వారం లాంటిందని అభివర్ణించారు. ఏ భాషవారైనా.. ఏ రాష్ట్రంవారైనా స్థానికులు అనే భావన కలిగేలా వాతావరణం పెంపొదిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాలను అందుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ కంపెనీలకు పిలుపునిచ్చారు

అభివృద్ధికే పెద్దపీట
ఐదేండ్ల పాలనలో ఎన్నికల కోసం కేవలం 6 నెలలే రాజకీయాలపై దృష్టి పెడతామని, మిగతా నాలుగున్నరేండ్లు రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనపై శ్రమిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం, రాష్ర్టాన్ని అన్నివిధాలా ముందుకు తీసుకెళ్లడమే తమ ధ్యేయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రధాన నగరానికైనా వెళ్తే.. తెలంగాణకు, హైదరాబాద్‌కు వచ్చి చూడండంటూ తాను చెప్తున్న మాటల్లో వాస్తవం ఏంటో గ్రహించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.