మాటిస్తున్నా.. ఆస్పత్రి కట్టిస్తా: మెగాస్టార్‌ ప్రకటన 49m

ఒక చిత్రాన్ని తీయడంలో తెరవెనుక ఎంతో శ్రమిస్తున్న సినీ కార్మికుల కోసం తాను ఓ ఆస్పత్రి కట్టిస్తానని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రకటించారు.

తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేయనున్న ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసి, సేవలు అందిచేలా చూస్తానని మాటిచ్చారు. హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణకు చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిర్వాహకులు సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎదుటివారికి చేతనైనంత సాయం చేసినప్పుడు వచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదని ఆయన అన్నారు.

‘మా అందరికీ చదువులు అంతంత మాత్రమే. అయినా మేం సౌకర్యవంతంగా జీవిస్తున్నామంటే దానికి సినీ పరిశ్రమే కారణం. అందుకే సినిమా కోసం శ్రమిస్తున్న కార్మికులకు చిత్రపురి కాలనీలో ఓ ఆస్పత్రి కట్టించాలని ఎంతోకాలంగా అనుకుంటున్నా. రోజువారీ సినీ కార్మికులకు ఉపయోగపడేలా 10 పడకలతో ఓ ఆస్పత్రి ఉంటే బాగుంటుందనిపించింది. మా నాన్నగారు కొణిదెల వెంకట్రావు పేరుతో ఈ ఆస్పత్రి నిర్మించాలనుకుంటున్నాం. ఈ పుట్టినరోజుకు మీకు మాటిస్తున్నా.. వచ్చే ఏడాది ఇదే సమయానికి ఆసుపత్రి కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ఈ ఆస్పత్రికి చేయూతనందిస్తున్న తమ్ముళ్లందరికీ, స్నేహితులకు ధన్యవాదాలు. ఈ ఆస్పత్రి నిర్మాణంలో ఎవరైనా భాగస్వాములవుతానంటే సంతోషంగా ఆహ్వానిస్తా. దానికి ఎన్నికోట్లు ఖర్చైనా మొత్తం భరించే శక్తి ఆ భగవంతుడు నాకిచ్చాడు. మా ఎదుగుదలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరిస్తున్న వర్కర్స్‌కు దీన్ని ఏర్పాటు చేయడం నా ప్రాథమిక బాధ్యతగా భావిస్తున్నా” అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

చిరు ప్రకటనతో స్టేజ్‌పై ఉన్న శ్రీకాంత్‌, తరుణ్‌, తమన్‌, సుధీర్‌ బాబు.. పలువురు నటీనటులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం తమన్‌ మాట్లాడుతూ.. ఈ ఆస్పత్రికి సాయం చేసేందుకు తాను ఓ మ్యూజికల్‌ షో ఏర్పాటు చేస్తానని, దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆస్పత్రి నిర్మాణానికి ఇస్తానని ప్రకటించారు. తమన్‌ సాయానికి చిరు ఎంతో ఆనందించారు. సినీ కార్మికులకు చిరు చేస్తోన్న సాయం తెలుసుకున్న మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా చిరు నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.