‘పుష్ప-2’లో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటుడు

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పుష్ప చిత్రానికి కొనసాగింపు కూడా వస్తోంది. అయితే, పుష్ప-2లో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పేయి కూడా నటిస్తున్నట్టు దాదాపు అన్ని ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. పుష్ప-2లో ‘ఫ్యామిలీ మేన్’ నటుడు అంటూ కథనాలు వెలువడ్డాయి. ఓ పోలీసాఫీసర్ పాత్ర కోసం పుష్ప టీమ్ మనోజ్ బాజ్ పేయిని సంప్రదించినట్టు ఆ కథనాల సారాంశం. దీనిపై మనోజ్ బాజ్ పేయి స్పష్టతనిచ్చారు. ఇవన్నీ ఒట్టి పుకార్లేనని ఖండించారు. వీటిలో నిజంలేదని అన్నారు. అసలు, ఇలాంటి వార్తలు ఎక్కడ్నించి పుట్టుకొస్తున్నాయి? అంటూ తిరిగి ప్రశ్నించారు.

మనోజ్ బాజ్ పేయికి దక్షిణాది చిత్ర పరిశ్రమ కొత్తకాదు. ఆయన గతంలో పలు తెలుగు చిత్రాల్లో నటించారు. ఇటీవల మాట్లాడుతూ, సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లా, రూ.500 కోట్లా, రూ.300 కోట్లా అనేది తనకు ముఖ్యం కాదని అన్నారు. ఇప్పుడందరూ బాక్సాఫీసు వద్ద ఎంత వసూలు చేసిందన్నదే లెక్కలోకి తీసుకుంటున్నారని వివరించారు. తాను ఈ బాక్సాఫీసు ట్రెండ్ కు ఎప్పటికీ వ్యతిరేకమని తెలిపారు. మనోజ్ బాజ్ పేయి ఇటీవల ‘ఫ్యామిలీ మేన్’ అనే వెబ్ సిరీస్ లో నటించగా, ఓటీటీ వేదికపై అది సూపర్ హిట్టయింది. ‘ఫ్యామిలీ మేన్-2’లో టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా నటించింది. ఆమె నటించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు ప్రకంపనలు రేపాయి.

Leave A Reply

Your email address will not be published.