నితిన్ పై నిప్పులుచెరిగిన ‘అమ్మ’ రాజశేఖర్

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ‘అమ్మ’ రాజశేఖర్ టాలీవుడ్ హీరో నితిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘టక్కరి’ చిత్రం వచ్చింది. ‘అమ్మ’ రాజశేఖర్ తాజాగా ‘హై ఫైవ్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో జరిగింది.

అయితే ఈ కార్యక్రమానికి నితిన్ వస్తానని మాటిచ్చారని, కానీ ఆయన హాజరు కాలేదని దర్శకుడు ‘అమ్మ’ రాజశేఖర్ ఆరోపించారు. ఒకవేళ వీలుకాకపోతే రాలేనని నేరుగా చెప్పేయాల్సిందని, వస్తానని చెప్పి రాకపోవడం తనను ఎంతో బాధించిందని ‘అమ్మ’ రాజశేఖర్ పేర్కొన్నారు. నిన్న నితిన్ ఇంట్లోనే ఉన్నాడని, ఫోన్ చేస్తే జ్వరం అని చెప్పాడని వివరించారు.

నితిన్ కు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి 10 రోజుల కిందటే చెప్పానని తెలిపారు. నితిన్ వస్తున్నాడు కదా అని, తిండి కూడా మానుకుని ప్రత్యేకంగా ఏవీ తయారుచేయించానని ‘అమ్మ’ రాజశేఖర్ వెల్లడించారు. ఫంక్షన్ కు రాలేకపోతే కనీసం ఓ వీడియో సందేశం అయినా పంపమని కోరితే, అందుకు కూడా స్పందన లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా సాయం చేసిన వారిని మర్చిపోరాదని, ఏమాత్రం డ్యాన్స్ రాని నితిన్ కు డ్యాన్స్ నేర్పించింది తానే అని ‘అమ్మ’ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. తనను ఓ గురువుగా భావించి ఈ కార్యక్రమానికి వస్తాడని ఆశిస్తే, రాకుండా తనను అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Amma Rajasekhar, Nitin, High Five Pre Release Event, Hyderabad, Tollywood

Leave A Reply

Your email address will not be published.