Thank You Movie Review: మూవీ రివ్యూ: ‘థ్యాంక్యూ’

Naga Chaitanya ThankYou Movie Review And Rating నాగచైతన్య హీరోగా .. దిల్ రాజు నిర్మాణంలో .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా రూపొందింది. రాశి ఖన్నా .. మాళవిక నాయర్ … అవికా గోర్ … ప్రకాశ్ రాజ్ .. సంపత్ రాజ్ .. తులసి ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. చాలా గ్యాప్ తరువాత విక్రమ్ కుమార్ నుంచి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఎంతవరకూ సక్సెస్ అయిందనేది చూద్దాం.

అభిరామ్ ( చైతూ) ఆంధ్రప్రదేశ్ లోని .. నారాయణపురం అనే విలేజ్ తన తల్లి సరస్వతి (తులసి)తో కలిసి ఉంటాడు. హాకీ ప్లేయర్ గా మంచి పేరు తెచ్చుకుని తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనేది అతని కోరిక. కానీ కొన్ని కారణాల వలన ఆయన రావు (ప్రకాశ్ రాజ్) కన్సల్టెన్సీ ద్వారా విదేశాలకి వెళతాడు. అక్కడ హెల్త్ కి సంబంధించి తాను కనిపెట్టిన ఒక యాప్ కి పూర్తి రూపాన్ని తీసుకుని రావడానికి ప్రియ (రాశి ఖన్నా) అతనికి సహాయపడుతుంది. ఆ యాప్ కారణంగా అభిరామ్ అక్కడి శ్రీమంతులలో ఒకరిగా మారిపోతాడు.

అయితే ఎప్పుడైతే సక్సెస్ .. డబ్బు .. పేరు వచ్చాయో, అభిరామ్ లో అహంభావం తలెత్తుతుంది. తన తెలివి తేటలతోనే తాను పైకి వచ్చానేనే గర్వంతో తన స్నేహితులను .. తనని ప్రేమిస్తున్న ప్రియను దూరం చేసుకుంటాడు. అతను సాధించిన విజయాల వెనుక కొంతమంది పాత్ర ఉందనీ, వాళ్లను మరిచిపోయి అంతా తన గొప్పతనమే అనుకోవడం పొరబాటని అభిరామ్ మనస్సాక్షి చెబుతుంది. పార్వతి .. నారాయణరావు .. చిన్నూ .. శర్వా అంటూ మనస్సాక్షి గుర్తుచేస్తుంది. దాంతో మనస్సాక్షి చెప్పినట్టుగా వాళ్లందరినీ ఒకసారి కలవాలని అభిరామ్ అనుకుంటాడు ఉన్నపళంగా ఆంధ్ర బయల్దేరతాడు. అభిరామ్ గతం ఎలాంటిది? ఆయన కలుసుకోవాలని అనుకుంటున్న వాళ్లంతా ఎవరు? ఆయన ఎదుగుదలకి వాళ్లంతా ఎలా కారణమయ్యారు? అక్కడికి వెళ్లిన తరువాత అభిరామ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనే ఆసక్తి కరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

బీఏవీస్ రవి రాసిన ఈ కథను ఫాలో అవుతూ వెళుతుంటే ‘నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ .. ‘ప్రేమమ్’ వంటి కథలు గుర్తుకు వస్తాయి. అలాంటి ఒక ఫీల్ తోనే ఈ కథ నడుస్తుంది. ముందుగా రాశి ఖన్నా ట్రాక్ .. ఆ తరువాత మాళవిక నాయర్ ట్రాక్ .. ఆ తరువాత చెల్లెలు తరహా పాత్రలో అవికా గోర్ కనిపిస్తారు. మొదటి రెండు ఎపిసోడ్స్ ప్రేమను టచ్ చేస్తూ సాగితే, మూడో ఎపిసోడ్ లో హాకీ నేపథ్యంలో నడిచే కాలేజ్ గొడవలు ఎక్కువగా కనిపిస్తాయి.

బీవీఎస్ రవి రాసిన ఈ కథలో మంచి ఫీల్ ఉంది. ఆ ఫీల్ ను కొన్ని చోట్ల విక్రమ్ కుమార్ గొప్పగా ఆవిష్కరించాడు. అయితే స్క్రీన్ ప్లే అంత పట్టుగా అనిపించదు. చాలా సాదా సీదాగా .. రొటీన్ గా ప్రధానమైన పాత్రలు పరిచయమైపోతుంటాయి. ఏ పాత్రకి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉండదు. ఆ పాత్రలను కాస్త ఇంట్రస్టింగ్ గా డిజైన్ చేయడానికి తగిన ప్రయత్నం కనిపించదు. చైతూ .. రాశి ఖాన్నలా మధ్య లిప్ లాకులు ఉన్నాయికానీ వాళ్ల మధ్య ప్రేమ కనిపించదు. ఆ ట్రాక్ కి అంత సమయం అవసరం లేదని కూడా అనిపిస్తుంది.

ఇక మాళవిక నాయర్ కి సంబంధించిన ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఆకర్షణీయమైన ఆమె కళ్లను .. పదునైన చూపులను కెమెరాలో పట్టేసిన తీరు బాగుంది. విలేజ్ నేపథ్యంలో నడిచే ఈ ట్రాక్ లో టీనేజ్ కుర్రాడిగా చైతూ లుక్ కాస్త ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ, మాళవిక లుక్స్ కవర్ చేసేస్తాయి. ఈ ట్రాక్ నడుస్తుంటే ‘నా ఆటోగ్రాఫ్’ సినిమాలో కేరళ ఎపిసోడ్ గుర్తొస్తుంది. ఈ ఎపిసోడ్ అయిపోయినప్పుడు మాత్రం అయ్యే మరి కాసేపు ఉంటే బాగుండునే అనిపిస్తుంది. ఇక కాలేజ్ డేస్ లో గొడవల ఎపిసోడ్ ను కూడా కాస్త ట్రిమ్ చేసుకోవచ్చు. అక్కడ చెప్పదలచుకున్న విషయానికి అంత నిడివి అవసరం లేదు. విక్రమ్ కుమార్ ఈ కథను ఆంధ్రప్రదేశ్ లోను .. విదేశాల్లోను పరుగులు తీయించాడు. రాశి ఖన్నా ఎపిసోడ్ లో ప్రకాశ్ రాజ్ పాత్రను బలహీనంగా డిజైన్ చేసుకున్నాడు. అలాగే మాళవిక నాయర్ ట్రాక్ లో సంపత్ రాజ్ ట్రాక్ ను బలహీనంగా రాసుకున్నాడు. చైతూ కాలేజ్ ట్రాక్ ను ఏ మాత్రం అంచనాలు లేని కొత్త ఆర్టిస్టుపై నడిపించారు. ఈ మూడు విక్రమ్ కుమార్ చేసిన పొరపాట్లుగా కనిపిస్తాయి.

చైతూ పాత్రల పరంగా తన నటనలో వేరియేషన్స్ ను బాగా చూపించాడు. కానీ కొన్ని సన్నివేశాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేకపోయాడు. రాశి ఖన్నా తన పాత్ర ద్వారా మంచి ఎమోషన్స్ పలికించింది. ఇక మాళవిక నాయర్ కాలేజ్ డ్రెస్ లోను .. చీరకట్టులోను చాలా అందంగా కనిపించింది. అవికా గోర్ కి ఉన్న అనుభవానికి ఈ పాత్ర చాలా చిన్నది. ప్రకాశ్ రాజ్ .. సంపత్ రాజ్ ఇద్దరూ ఇద్దరే. కానీ అక్కడ వాళ్లను ఉపయోగించుకోలేదు. ఇక తులసి .. ఈశ్వరీరావు పరిస్థితి కూడా అంతే. ఆ వెలితి స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ సినిమాకి తమన్ అందించిన పాటల్లో ‘ఏంటో ఏంటేంటో’ అనే పాట బాగుంది. ఇక తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం గొప్పగా ఉంది. బీవీఎస్ రవి కథలో .. విక్రమ్ కుమార్ ఆవిష్కరణలో ఆశించిన స్థాయి ఫీల్ వర్కౌట్ కావడానికి కారణం ఆయన కెమెరా పనితనమే. ఇటు విదేశాల్లోను .. అటు విలేజ్ లోను ఆయన కెమెరా బలం కనిపిస్తుంది. కాకపోతే అక్కడక్కడా మరీ టైట్ క్లోజ్ లు ఇబ్బంది పెడతాయి. లవ్ .. ఎమోషన్ .. యాక్షన్ ను టచ్ చేస్తూ వెళ్లిన ఈ కథ, ఆడియన్స్ కి అక్కడక్కడ మాత్రమే కనెక్ట్ అవుతుందని చెప్పచ్చు.

Leave A Reply

Your email address will not be published.