కాంగ్రెస్‌లో మర్రి వ్యాఖ్యల కలకలం

కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇప్పుడు సీనియర్‌ ‌నేత మర్రి శశిధర్‌ ‌రెడ్డి వ్యవహారం కాక రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డి తరవాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను కలిసేందుకు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి,మర్రి శశిధర్‌ ‌రెడ్డిలు అపాయింట్‌మెంట్‌ ‌కోరారు. రాష్ట్రకాంగ్రెస్‌ ‌పరిస్థితులను వివరించాలని వారు చూస్తున్నారు. ఇదిలావుంటే మర్రి ఆవేదనపై రేణుకా చౌదరి స్పందించారు. మర్రి శశిధర్‌ ‌రెడ్డి ఓపికగా ఉండే వ్యక్తి అని ఆ పార్టీ నేత రేణుకా చౌదరి అన్నారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ.. ఆయనకు ఏదో మనసుకు బాధ అనిపించి మాట్లాడి ఉంటారని చెప్పుకొచ్చారు. శశిధర్‌ ‌రెడ్డి సమస్య సర్దుకుంటుందని తెలిపారు. టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కూడా ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. పార్టీలో మమ్మల్ని అవమానించే వారు ఎవరు లేరు. అవమానిస్తే దుమారం ఎలా లేపాలో మాకు కూడా తెలుసు.

ఖమ్మం లో నన్ను ఎదుర్కునే మొనగాడు లేడు అని ఆమె తెలిపారు. కాంగ్రెస్‌ ‌నుంచి రాజగోపాల్‌ ‌రెడ్డి వెళ్లడం బాధాకర మన్నారు. మునుగోడులో కాంగ్రె గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఇలాంటివి సహజం అన్ని సర్దుకుంటాయని చెప్పారు. బీజేపీలో కూడా చాలా సమస్యలు, నేతల మధ్య విబేధాలు ఉన్నాయని రేణుకా చౌదరి పేర్కొన్నారు. ఇదిలావుంటే కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత మర్రి శశిధర్‌ ‌రెడ్డి పార్టీ పెద్దలపై చేసిన వ్యాఖ్యలు సరికావని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. తనను అన్నందుకు బాధపడను కానీ పీసీసీపై, మాణికం ఠాగూర్‌పై అలా మాట్లాడటం సీనియర్‌ ‌నేతకు తగదని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూరే కారణమంటూ ఆ పార్టీ సీనియర్‌ ‌నేత మర్రి శశిధర్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ ‌తాజాగా స్పందించారు. పీసీసీ, మాణికం ఠాగూర్‌ ‌గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని, పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. తాము చేసిన వ్యాఖ్యలను పెద్దవి కాకుండా సద్దుమణిగే విధంగా చేయాల్సిన వారు, పార్టీకి సలహాలు ఇవ్వాల్సిన సీనియర్లే ఇలా చేయడం సరికాదన్నారు.

భాజపా, ఆరెస్సెస్‌ ‌చేస్తున్న కుట్రల్లో కాంగ్రెస్‌ ‌పావులుగా మారుతున్నట్లుగా అనిపిస్తోందని అద్దంకి వ్యాఖ్యానించారు. పీసీసీని ఇలా అంటే పార్టీకే నష్టమని.. ఏదైనా ఉంటే చూసుకోవడానికి పీసీసీ, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీలు ఉన్నాయని చెప్పారు. తనపైనా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో స్పందిస్తున్నాని, రేవంత్‌ ‌రెడ్డి చెప్తే కాదని అద్దంకి అన్నారు. పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం సరికాదు. ఏదన్నా ఉంటే క్రమశిక్షణ కమిటీ చూస్తుంది. ఒక సీనియర్‌ ‌నాయకుడిగా ఇలా మాట్లాడటం సరికాదు. నన్ను అన్నందుకు బాధపడను.. కానీ పీసీసీపై, మాణికం ఠాగూర్‌పై అలా మాట్లాడటం వి•కు సరికాదని అద్దంకి దయాకర్‌ అన్నారు. అంతకుముందు బుధవారం మర్రి శశిధర్‌ ‌రెడ్డి.. రేవంత్‌రెడ్డి, మాణికం ఠాగూర్‌ ‌గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆ ఇద్దరు నేతలు అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకుసాగేలా దిశానిర్దేశర చేయాల్సిన మాణికం ఠాగూర్‌.. ‌రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా కలత చెందుతున్నానని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని శశిధర్‌రెడ్డి ఆవేదన చెందారు.

Leave A Reply

Your email address will not be published.