చైనా చేసిన తప్పును మనం చేయవద్దు..: ఓవైసీ

ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదని నియంత్రించే ఏ చట్టం అయినా తాను సమర్థించనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టంచేశారు. ‘‘చైనా చేసిన తప్పిదాన్ని మనం పునరావృతం చేయకూడదు. ఇద్దరు పిల్లలకు మించి కలిగి ఉండరాదన్న చట్టానికి నేను మద్దతు పలకను. ఎందుకంటే అది దేశానికి మంచిది కాదు’’అని ఓవైసీ గురువారం ఓ వార్తా సంస్థతో తన అభిప్రాయాలను తెలియజేశారు.

‘‘దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. 2030 నాటికి ఇది స్థిరపడుతుంది. కనుక చైనా చేసిన తప్పును ఇక్కడ మనం కూడా చేయరాదు’’అని పేర్కొన్నారు. ఒక మతంలో జనాభా పెరగడం, ఒక మతంలో తగ్గడం అన్నది జరగరాదంటూ ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. జనాభా అసమతుల్యతను ఆయన ప్రస్తావించారు.

దేశంలో ముస్లింలే ఎక్కువగా సంతాన నిరోధక సాధనాలను వాడుతున్నట్టు ఓవైసీ సైతం ఇటీవలే పేర్కొనడం గమనార్హం. జనాభా విషయంలో ముస్లింలనే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారంటూ ఆయన లోగడ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ‘‘ముస్లింలు భారతీయులు కారా? వాస్తవాన్ని చూస్తే గిరిజనులు, ద్రవిడులే ఇక్కడి వారు’’అని కూడా ఓవైసీ అన్నారు.
population control, comments, Asaduddin Owaisi, 2 children

Leave A Reply

Your email address will not be published.