వికారాబాద్ తెరాసలో సై అంటే సై!

వికారాబాద్ జిల్లాలో తెరాస ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు ద్వితీయశ్రేణి నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో సమస్య ఎక్కువగా ఉంది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల మధ్య కొంతకాలంగా అగాధం పెరుగుతూ వస్తోంది. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మహేందర్ రెడ్డిల మధ్య కూడా ఇదే పరిస్థితి ఉంది.

శనివారం వికారాబాద్ వచ్చిన మహేందర్ రెడ్డీ సీఎం పర్యటన ఏర్పాట్లను తన వర్గీయులతో కలిసి పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ఆనంద్ కు సమాచారం ఇవ్వలేదు. ఆ అవసరం తనకు లేదన్నారు. అలాగే జడ్పీ అధ్యక్షురాలు పట్నం సునీతా మహేందర్ రెడ్డీ వికారాబాద్ నియోజకవర్గంలో ఇటీవల పర్యటించగా ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పంచాయతీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వరకు వెళ్ళింది.

 

తాండూరులో కాంగ్రెస్ తరపున పోటీచేసి తెరాస అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డిపై విజయం సాధించిన పైలట్ రోహిత్ రెడ్డి.. అనంతరం తెరాసలో చేరారు. తాండూరు పురపాలిక ఛైర్మన్ పదవి చెరో రెండున్నరేళ్లు తీసుకునేలా అధ్యక్షురాలు స్వప్న, ఉపాధ్యక్షురాలు దీపల మధ్య పార్టీ నేతలు ఒప్పందం కుదిర్చారు. రెండున్నరేళ్ల తర్వాత కూడా స్వప్న ఇంకా పదవిలో కొనసాగుతున్నారు. ఒప్పందం ప్రకారం దీపకు అవకాశం ఇవ్వాలని రోహిత్ రెడ్డి, ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. ఎలాగైనా స్వప్ననే కొనసాగించాలనే పట్టుదలతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఉన్నారు.

వికారాబాద్ లోను ఇదే పరిస్థితి. ఈ పురపాలిక అధ్యక్షురాలిగా మంజుల కొనసాగుతున్నారు. రెండున్న రేళ్లు గడిచిన నేపథ్యంలో ఆమె పదవి నుంచి దిగిపోయి పుష్పలతారెడ్డికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వైరివర్గం నుంచి ఉంది. ఈ అంశాలే నేతలు వర్గాలుగా చీలిపోవడానికి కారణమవుతోందనే విమర్శలున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 16న సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి పనుల్లో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగానైనా సీఎం జోక్యం చేసుకుని ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య కుదిరిస్తే పార్టీకి మంచి జరుగుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.