రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కరణ

రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వాతంత్య వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన ప్రశాంతంగానే కాదు..గ్రాండ్‌ ‌సక్సెస్‌ అయ్యింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది. సీఎం కేసీఆర్‌ ‌పిలుపు మేరకు తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపనతో ఊరూ, వాడా..ప్లలె, పట్నం దద్దరిల్లింది. సరిగ్గా 11.30 గంటలకు రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు అంగన్‌వాడీ తదితర సెంటర్లో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. కాగా, హైదరాబాద్‌లోని అబిడ్స్ ‌జీపీఎస్‌ ‌సర్కిల్‌ ‌వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ‌హాజరై జనగణమన ఆలపించారు. సీఎం వెంట మంత్రులు, తదితరులు ఉన్నారు.మంగళవారం ఉదయం 11గం.30ని. ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా అందరూ జనగణమన ఆలపించాలని టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కోరిన వెంటనే అందుకు తగ్గట్లుగా ప్రజలంతా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హైదరాబాద్‌ అబిడ్స్‌లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అబిడ్స్ ‌జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ ప్రముఖలు, అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించింది. ఒక్క నిమిషం మెట్రోసర్వీసులు ఆగిపోగా..ఎక్కడికక్కడే ప్రయాణికులు జాతీయ గీతం ఆలపించారు. సికింద్రాబాద్‌ ‌ప్యాట్నీ కూడలి వద్ద జనగణమన జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న నగర పౌరులు స్వాతంత్య వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. ప్రజలంతా ఒకేచోట ఏకమై జనగణమన గీతాన్ని ఆలపించారు. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంటే..ఒకే గొంతుకలో వినిపించిన జాతీయ గీతంతో తెలంగాణం మురిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలంతా ఒకేచోట ఏకమై..ఒకే గొంతుకలో జనగణమన గీతాన్ని ఆలపించారు. ఆ ఒక్కక్షణం రాష్ట్రమంతా ఉద్వేగానికి లోనైంది. ప్రతి ఒక్కరి కళ్లు 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని గుర్తు చేసుకుంటూ చెమ్మగిల్లాయి. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుల పోరాటాన్ని స్మరిస్తూ ప్రజలంతా జాతీయ గీతాన్ని పాడారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు హైదరాబాద్‌ అబిడ్స్ ‌జీపీవో కూడలి వద్ద జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. అబిడ్స్ ‌సర్కిల్‌కు చేరుకున్న కేసీఆర్‌..‌నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎం‌పీలు కేశవరావు, అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు. సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో భాగంగా..రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లు త్రివర్ణాలతో కళకళలాడాయి.

అబిడ్స్ ‌జీపీవో సర్కిల్‌ ‌వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్య సమరయోధుల చిత్ర పటాలు, రంగుల బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం కోసం ట్రాఫిక్‌ ‌పోలీసులు అన్ని కూడళ్ల వద్ద రెడ్‌ ‌సిగ్నల్‌ ‌వొచ్చేలా ఏర్పాటు చేశారు. జాతీయ గీతాలాపన ముగిసే వరకు వాహనాలన్ని కూడళ్ల వద్ద నిలిపివేశారు. వాహనదారులతో పాటు ట్రాఫిక్‌ ‌పోలీసులూ జాతీయగీతాన్ని ఆలపించారు. సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్‌ ‌నియమాలను చెప్పేందుకు ఏర్పాటు చేసిన మైకుల్లోనూ జాతీయ గీతం వినిపించారు. హైదరాబాద్‌ ‌ట్రాఫిక్‌ ‌సంయుక్త సీపీ రంగనాథ్‌ ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిగింది. సామూహిక జాతీయ గీతాలాపన ముగిసిన తర్వాత వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిగ్నళ్లను నిర్వహించారు. సిగ్నల్స్ ‌వద్ద నిమిషం పాటు రెడ్‌ ‌సిగ్నల్‌ ఇచ్చి అంతా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు మిగతా జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ ‌నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే చాలాచోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు మాత్రం ఎదుర్కున్నారు వాహనదారులు.

Leave A Reply

Your email address will not be published.