కేసీఆర్ ను ఓడించడమే నా జీవిత లక్ష్యం: ఈటల రాజేందర్

కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను పోషించే బాధ్యతను హైకమాండ్ తనకు అప్పచెప్పిందని తెలిపారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన నేతలు తనతో టచ్ లో ఉన్నారని… త్వరలోనే ఊహకు అందనంత స్థాయిలో చేరికలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతో కాలంగా తనకు మంచి మిత్రుడని… ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని అన్నారు.

హుజూరాబాద్ ప్రజల కాలికి ముళ్లు గుచ్చుకుంటే నోటితో పీకే వ్యక్తి ఈటల అని చెప్పారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని ఈటల విమర్శించారు. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు పెడుతున్న ఆహారంలో వానపాములు, బొద్దింకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు సరిగా డబ్బులు చెల్లించకపోవడం వల్లే వారికి నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.