నామా తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు?

న్యూఢిల్లీ, జూన్ 5, (ఎఫ్ బి తెలుగు): తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య పొలిటికల్ హీట్ నడుస్తున్న వేళ అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావుకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. మధుకాన్ గ్రూప్ రూ. 10.30 కోట్ల రుణాలు పొంది దారి మళ్లించినట్లు ఈడీ 2002 లో గుర్తించి కేసు నమోదు చేయగా.. కేసులో భాగంగా 96.21 కోట్ల విలువైన మధుకాన్ కంపెనీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అయితే ఈ వ్యవహారంపై రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ ఎంపీ మాత్రమే కాదు. లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత కూడా. అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నామా ఆస్తులపై ఈడీ దూకుడు పెంచడం వెనుక అంతా సహజంగా జరుగుతున్న వ్యవహారమేమి కాదని, దీని వెనుక బీజేపీ పెద్దల వ్యూహాత్మక అడుగులు ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ను నిలువరించే చర్యల్లో భాగంగా పార్టీ కీలక నేతలపై బీజేపీ దృష్టి సారించిందని ఇప్పుడు నామా వంతు కాగా భవిష్యత్ లో మరికొంత మందిపై ఈడీ దాడులు తప్పవనే టాక్ తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తోంది.

తమపై ధిక్కార స్వరం పెంచిన పార్టీలకు చెందిన నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీ భయపెట్టాలని చూస్తోందని ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో ఓవైపు రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగానే మరో వైపు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు పంపింది. ముంబైలోని ఓ భవన సముదాయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో ఆయన్ను విచారణకు రావాలని ఆదేశించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై స్పందించిన శరద్ పవార్.. గత ఎన్నికల సమయంలో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగం నుండి ప్రేమ లేఖ వచ్చింది అంటూ సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు.ఇప్పుడు టీఆర్ఎస్ నేత నామా వంతు కావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.

అది కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ లో పర్యటిస్తున్న సమయంలో అదే కార్యక్రమంలో ఉన్న సమయంలోనే నామా నాగేశ్వరరావు కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం దుమారం రేపుతోంది. నిజానికి ఈ కేసులన్ని తాజావి కావు. గతంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు సంస్థలు చర్యలు ప్రారంభించాయి. కానీ చర్యలు కొనసాగుతున్న సమయమే బీజేపీకి వ్యతిరేకంగా నేతలు నడుచుకుంటున్న తరుణంలో జరుగుతుండటం ప్రతిపక్షాల అనుమానాలకు ఊతమిస్తున్నాయి. తాజాగా నామా విషయంలో ఈడీ చర్యలు టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త అనుమానాలకు కారణం అవుతోందట.టీఆర్ఎస్ సర్కార్ ను గద్దెదింపి తాము అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణం ఇందుకు ఓ కారణం అయితే తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలంటే టీఆర్ఎస్ ఆర్థిక వనరులపై దెబ్బకొట్టాలనేది బీజేపీ వ్యూహం అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మేరకు గులాబీ పార్టీకి ఆర్థిక వనరులుగా ఉన్న వారెవరూ అనే జాబితాను బీజేపీ పెద్దలు సిద్దం చేసుకున్నారని, ఆ ప్రకారం వ్యూహాల అమలుకు సిద్దం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి రావాల్సిన రుణాల విషయంలో ఆంక్షలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. పార్టీ పరంగా టీఆర్ఎస్ ఆర్థిక మూలాలు, వాటిని సమకూర్చుతున్న వారెవరూ అన్న దానిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.టీఆర్ఎస్ కు ఆర్థిక వనరులు ఎలా సమకూరాయి? ఎవరెవరూ సహకరించారు? అనే కోణంలో నజర్ వేసినట్లు టాక్. అన్ని విధాలుగా టీఆర్ఎస్ ఆర్థిక మూలాలను కట్టడి చేయగలిగితే రాబోయే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ స్పీడును అడ్డుకోవచ్చనేది బీజేపీ వ్యూహామని, అందులో భాగంగానే అదును చూసి నామా కంపెనీపై చర్యలకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నామా వంతు కాగా త్వరలో మరి కొందరు టీఆర్ఎస్ నేతలకు ఝలక్ ఇవ్వకతప్పదనే ప్రచారం జరుగుతోంది. అయితే నామా తర్వాత ఈడీ దెబ్బ రుచిచూడబోతోన్న నేతలు ఎవరూ అనేది ఇంకా స్పష్టత రాకపోయినా త్వరలో ఆ సంగతి కూడా బయటకు వస్తుందనే టాక్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.