తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన శత్రువు

స్వరాష్ట్రంలో మనం జిల్లాలు ఏర్పరచుకొని సుపరిపాలనతో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ ‌రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్‌ ‌జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన సందర్భంగా వికారాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, 35 ఎకరాలలో 60.7 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా 5 ఎకరాల స్థలంలో 235 కోట్ల వ్యయంతో నిర్మాణం గావించబడే మెడికల్‌ ‌కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదుపరి కలెక్టర్‌ ‌ఛాంబర్‌లో నిర్వహించిన పూజలో ముఖ్యమంత్రి పాల్గొని కలెక్టర్‌ను కుర్చీలో ఆసీనులను గావించి అభినందనలు తెలిపారు. అంతకు ముందు వికారాబాద్‌కి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పోలీస్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లోని హెలిప్యాడ్‌ ‌వద్ద రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు పి. సబితా ఇంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌నిఖిల, జిల్లా పరిషత్‌ ‌చైర్పర్సన్‌ ‌పి సునీత మహేందర్‌ ‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్‌ ‌సభ్యులు గడ్డం రంజిత్‌ ‌రెడ్డి, శాసనమండలి సభ్యులు పి. మహేందర్‌ ‌రెడ్డి, సురభి వాణిదేవి, శాసనసభ్యులు డాక్టర్‌ ‌మెతుకు ఆనంద్‌, ‌కాలే యాదయ్య, కొప్పుల మహేష్‌ ‌రెడ్డి, పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి, వికారాబాద్‌ ‌మునిసిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌చిగుళ్లపల్లి మంజుల రమేష్‌ ‌లతో స్థానిక ప్రజాప్రతితులు, అధికారులు పూల గుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాట్లాడుతూ…తెలంగాణకు ప్రధాన శత్రువు ప్రధాని నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. వికారాబాద్‌ ‌జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆటంకం కలిగిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన దుయ్యబట్టారు. బిజెపిని నమ్ముకుంటే కైలాసం ఆటలో పెద్దపాము నోట్లో పడ్డట్టేనని అన్నారు.

గ్యస్‌, ‌పెట్రోలు రేట్లు పెంచి సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తూ పెద్దలకు లక్షల కోట్లు మాహీ చేస్తూ దోచిపెడుతున్నదని కెసిఆర్‌ ‌కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ సాధించకుంటే మనకు జిల్లా ఏర్పాటు అయ్యేదా అని పేర్కొని తెలంగాణ సాధించుకొని జిల్లా ఏర్పాటు చేసుకొని అద్భుతంగా కలెక్టరేట్‌ ‌నిర్మాణం చేసుకొని అభివృద్ధి దిశగా సాగుతున్నామని పేర్కొన్నారు. వికారాబాద్‌ ‌కు మెడికల్‌ ‌కళాశాల అదేవిధంగా వికారాబాద్‌ ‌పరిగికి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి గ్రామాలు పట్టణాలు అభివృద్ధి దిశలో సాగుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఒంటరి మహిళలకు, వృద్ధులకు వికలాంగులకు పింఛన్లను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు గతంలో 200 ఉన్న పెన్షన్లు నేడు రెండు వేలు చేసి ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణలో రైతుల అభివృద్ధికి ఎకరాకు పదివేల రూపాయలు రైతుబంధు అమలు చేస్తూ నాణ్యమైన విద్యుత్‌ ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఎక్కడైనా రైతు ప్రమాదవశాత్తు కానీ మామూలుగా చనిపోయిన ఐదు లక్షల రూపాయల బీమా డబ్బులు ఇచ్చి రైతు కుటుంబాలకు ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణకు ప్రజల శత్రువుగా మారిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనను ప్రభుత్వాన్ని పారద్రోలి మనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని తీసుకువచ్చేలా సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రజలకు విన్నపం చేశారు.

సమైక్యవాదులు మరోసారి మనల్ని మోసం చేసేందుకు చూస్తున్నారని అందులో భాగంగానే అభివృద్ధికి కృషి చేస్తున్న వికారాబాద్‌ ‌పర్యటనకు వచ్చిన సందర్భంలో తనకు బిజెపి కార్యకర్తలు అడ్డుకోవడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి సన్యాసుల్లారా కేంద్రంతో మాట్లాడి తెలంగాణలో అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయండి అని అడ్డుకోవడం మానుకోవాలని సూచించారు. పక్క కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అమలు చేయాలని కోరుతున్నారని లేదంటే తెలంగాణలో తమను కలపాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములకు ధరలు రాకుండా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఉద్యమ సమయంలో పేర్కొన్నారని కానీ అందుకు విరుద్ధంగా దేశంలో ఎక్కలేని విధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు గరిష్టంగా ఉన్నాయని ఇక్కడ ఒక ఎకరా భూమి అమ్ముకుంటే వేరే రాష్ట్రాలలో 4,5 ఎకరాలు కొనుక్కోవచ్చునని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. 58 సంవత్సరాల ఇతరుల పాలనలో మనం ఎంతో మోసపోయామని చావు అంచుల దాకా పోయి తెలంగాణ తీసుకొచ్చిన తనకు నమ్మి ముఖ్యమంత్రిగా చేసినందుకు ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతూ బంగారు తెలంగాణకు కృషి చేస్తున్నానని తెలిపారు.

ప్రజలారా ఇది గుర్తుంచుకోండి ఇకనైనా మోసపోయి గోస పడవద్దు ఒక్కసారి మనం మోసపోయామంటే మళ్ళీ పూర్వపు రోజులు వస్తాయని ప్రజలు ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలిపారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా 57 సంవత్సరాల వారికి ఈ నెల నుండి 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు. వికారాబాద్‌ ‌జిల్లాకు అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒకటి బకాయి ఉంది దానిని త్వరలో పూర్తిచేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్‌ ‌హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు విద్యుత్‌ ‌మీటర్లు బిగించాలని వారి నెత్తిన కత్తి పెట్టి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. మనమిస్తున్న ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమై మన పథకాలను రద్దు చేయాలని ఆలోచన చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక గ్యాస్‌ ‌పెట్రోల్‌ ‌నిత్యవసర సరుకులు ధరలు పెరిగిపోయి సామాన్యుల జీవనం గగనంగా మారిందని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ బిజెపి నాయకుల్లారా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి తెలంగాణలో అభివృద్ధికి కృషి చేయాలి తప్ప ఇలా అడ్డుకోవడం లాంటి తప్పుడు పనులు చేయవద్దని సీఎం కేసీఆర్‌ ‌సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.