కొత్త అధ్యక్షుడు వచ్చిన గంటల్లోనే.. శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు

శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ దేశ అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే నిరసనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కొలంబోలోని ప్రధాన క్యాంప్‌పై శుక్రవారం తెల్లవారు జామున వందల మంది భద్రతా బలగాలు, పోలీసులు విరుచుకుపడ్డారు. అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన నిరసనకారులకు చెందిన పలు టెంట్లను తొలగించారు.

ఆయుధాలు ధరించిన సైనికులు.. అధ్యక్షుడి సెక్రెటేరియట్‌ భవనం ముందు నిరసనకారులు ఏర్పాటు చేసిన శిబిరాలను తొలగించారు. సైనికులు, పోలీసుల దాడిలో దాదాపు యాభై మంది ఆందోళన కారులు గాయపడ్డారు. ఇందులో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా ‘గొట గొ గామా’ పేరుతో ఏర్పాటు చేసిన నిరసన శిబిరాన్ని వందలాది మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టి  ధ్వంసం చేశారని నిరసనకారులు తెలిపారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి చేశారని ఆరోపించారు.

ఈనేపథ్యంలో మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాదిరిగానే Ranil Wickremesinghe హయాంలో కూడా అణచివేత కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న సమయంలో శ్రీలంకలో ఆదివారం అత్యవసర పరిస్థితిని విధించారు. అయితే తాము వెనక్కి తగ్గేదే లేదని నిరసనకారులు స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 9 నుంచి అధ్యక్షుడి కార్యాలయం ప్రవేశ ద్వారాన్ని మూసివేసిన వారు.. కొత్త అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘే రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.