ఓ వైపు చేరికలు.. మరో వైపు అభివృద్ధి జెట్ స్పీడ్ లో కారు

హైదరాబాద్, జూలై 4, (ఎఫ్ బి తెలుగు): టీఆర్ఎస్ ఇక జెట్ స్పీడ్ పెంచబోతుంది. ప్రతి గ్రామంలో విస్తృత పర్యటనలు నేతలు చేయనున్నారు. పట్టణాల్లోని డివిజన్లను సైతం కలియదిరుగనున్నారు. ఒకవైపు చేరికలు.. మరోవైపు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించడం.. స్థానిక బీజేపీ నేతల నిలదీత కార్యక్రమాలను చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 5 నుంచి అమలు చేసేలా పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో పాటు పార్టీ నేతలకు సైతం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేంద్రం తెలంగాణపై అవలంభిస్తున్న విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలు, ప్రతివిమర్శలకు ఎక్కుపెట్టాయి. జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ నిర్వహించి, తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కార్యవర్గ సమావేశాల్లో నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అయితే బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 5 నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామాలు పట్టణాలు, నగరాల్లోని డివిజన్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పర్యటించనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 8ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు.

తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించిన నిధులు, తిరిగి తెలంగాణకు రావాల్సిన వాటాను ఎంత ఇచ్చిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో వివరిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. అంతేకాదు డివిజన్, మండల, గ్రామ బీజేపీ నేతలను సైతం నిలదీయనున్నారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని, గ్రామాల అభివృద్ధికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేయనున్నారు. ప్రజలను సైతం అందులో భాగస్వాములను చేసి టీఆర్ఎస్ కు బాసటగా నిలిచేలా చర్యలు చేపట్టనున్నారు.

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగేలా ప్రణాళికలను రూపొందించారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశాలు సైతం జారీ చేసినట్లు సమాచారం. సర్వేల్లో వీక్ గా ఉన్న ఎమ్మెల్యేలకు మాత్రం ఇది సువర్ణావకాశంగా మారనుంది. తిరిగి ఆ నియోజకవర్గంలో పట్టునిలుపుకునే అవకాశాలు లేకపోలేదు.రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి గట్టి పోటీ లేకుండా చేసేందుకు టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతల వివరాలను సేకరించింది. ఎవరైతే పార్టీలో చేరేందుకు అనుకులంగా ఉన్నారో వారిని సందర్భానుసారంగా పార్టీలో చేర్చుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ఆయా పార్టీల రాష్ట్ర బాధ్యులకు చుక్కలు చూపేలా స్కెచ్ వేస్తున్నారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతూ నగరంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ కేవలం ఒక శాంపిల్ మాత్రమేనని, రాబోయే కాలంలో అసలు సినిమా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ తన బల ప్రదర్శన కోసం నిర్వహించిన కార్యక్రమం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యనించారు. మొన్న బీజేపీ కార్పొరేటర్లు చేరికను పురస్కరించుకొని గ్రేటర్ అధ్యక్షుడు గోపీనాథ్.. భవిష్యత్ లో ఇంకా చాలా చేరికలు ఉంటాయని, ఇది ఆరంభమేనని పేర్కొన్నారు.

బీజేపీ కేంద్ర అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టడం, అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతుండటంతో దానికి ధీటుగా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తుంది. తెలంగాణ మీద బీజేపీ మీద ఎట్లపడుతుందో… బీజేపీ మీద టీఆర్ఎస్ అలాగే పడబోతుంది. బీజేపీకి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేకుండా చేయాలని అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని చేసిన హాట్ కామెంట్ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి కేసీఆర్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర లేక్క చేస్తే కేంద్రంలో బీజేపీని గద్దె దించుతామని హెచ్చరికలు చేశారు. ఏదీ ఏమైనప్పటికీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. ఇది ఎటు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.