దేశానికి బీహార్ మార్గం చూపింది
యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాం: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్
గతంలో ఎన్నడూ జరగని తరహాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తెలిపారు.ప్రస్తుతం దేశానికి ఏది అవసరమో బిహార్ అదే చేసింది..దేశానికి తాము ఓ దారి చూపామని ఆయన అన్నారు. నిరుద్యోగంపైనే తమ పోరాటమని, పేదలు, యువత ఇబ్బందులు చూసి సీఎం చలించారని, తాము నెలరోజుల్లో యువత, పేదలకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. బీజేపీ హయాంలో మత విద్వేషాలను వ్యాప్తి చేసారని, కాషాయ పాలకులు ప్రాంతీయ పార్టీలను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తేజస్వి యాదవ్ నిప్పులు చెరిగారు.
బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకుని మహాకూటమి తో చేతులు కలిపిన అనంతరం ఆర్జేడీ నేత కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మహాకూటమి పటిష్టంగా ఉందని, విపక్షంలో కేవలం కాషాయ పార్టీ ఒక్కటే ఉన్నదని ఆర్జేడీ నేత పేర్కొన్నారు. ఇక బిహార్ సీఎంగా జేడీ(యూ) నేత నితీష్ కుమార్ బుధవారం ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను వీడి మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ఆర్జేడీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్తో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.