బంధుప్రీతి, అవినీతి .. దేశానికి అత్యంత ప్రమాదకరం

దేశం ముందు ప్రధానంగా రెండు సవాళ్లు ఉన్నాయని, వాటిపై మనమంతా పోరాటంచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతిభావంతులు, అర్హులకే అవకాశాలు దక్కాలని చెప్పారు. మహిళలను అందరూ గౌరవించాలని స్పష్టం చేశారు. అవినీతి, బంధుప్రీతి దేశం ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండిటిపై ప్రజలంతా పోరాడాలని స్పష్టం చేశారు. 76వ స్వాతంత్య ్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ.. బంధుప్రీతి దేశానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. నవ సంకల్పంతో, సరికొత్త దారిలో ప్రయాణించే సమయం ఆసన్నమైందన్న మోదీ ..ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ స్వాతంత్య సమరయోధుల కలలను సాధ్యమైనంత త్వరగా సాకారం చేయాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని అన్నారు. అమృత సంకల్పంతో ముందుకు సాగాల్సిన సమయమిది అన్నారు. యావత్‌ ‌జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన వాళ్లను మరువలేమని పేర్కొన్నారు. 76వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. వొచ్చే 25 ఏళ్ల నాటికి శతాబ్ది ఉత్సవాలను అభివృద్ధి భారత్‌లో జరుపుకోవాలని ఆకాంక్షంచారు. జాతి సంపద, ఐక్యతను కాపాడుతూ వొచ్చే 25 ఏళ్లలో భారత్‌ను సమున్నత దేశంగా తీర్చిదిద్దేందుకు పనిచేయాలని సూచించారు. ఇందు కోసం ప్రధాని.. ఐదు తీర్మానాలను ప్రతిపాదించారు. ప్రజలంతా వీటిపైనే తమ శక్తినంతా కేంద్రీకరించాలని పిలువునిచ్చారు.

స్వాతంత్య్రం వొచ్చి వందేళ్లు అయ్యే నాటికి.. మన దేశం కోసం పోరాడిన వారి కలలను సాకారం చేసి చూపించాలన్నారు. ఈ 25ఏళ్ల పాటు యువత దేశ అభివృద్ధి కోసం తమ జీవితాలను అంకితం చేయాలి. దేశమే కాకుండా మొత్తం మానవజాతి అభివృద్ధికి పాటుపడాలి. అదే భారతదేశానికి ఉన్న బలం. పెద్ద సంకల్పాలతో ముందుకు కదలాలి. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ‘భారత్‌ అభివృద్ధి చెందిన దేశ’మనే కల సాకారం కావాలి. ఇందుకోసం వొచ్చే 25 ఏళ్ల పాటు ఐదు సూత్రాలపై దృష్టిసారించాలన్నారు. అభివృద్ధి చెందిన భారతం, బానిసత్వం నిర్మూలన, ఘనమైన వారసత్వం, ఏకత్వం, పౌరబాధ్యత ఇవే మన పంచప్రాణాలు అన్నారు. పంచప్రాణాల మార్గదర్శనంలో వొచ్చే 25 ఏళ్లు సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. 130 కోట్ల మంది సంకల్పంతో ఇది సాధ్యమవుతుంది. 130 కోట్ల మంది ఒక అడుగు ముందుకు వేస్తే.. దేశం 130 కోట్ల అడుగులు ముందుకు వేస్తుందన్నారు. ప్రతిభ ఉన్నవారికే అవకాశాలు ఇవ్వాలని మోదీ అన్నారు. నూతన భారతదేశానికి ప్రతిభ మాత్రమే ఆధారమని బంధుప్రీతి, వారసత్వాల గురించి తాను మాట్లాడితే రాజకీయం గురించి ప్రస్తావిస్తున్నా అని అనుకుంటారు. కానీ, దురదృష్టవశాత్తు ఈ కుటుంబ రాజకీయాలే ప్రతిరంగంలో బంధుప్రీతిని పెంచి పోషించాయి. వీటన్నింటిని మార్చాలంటే ప్రతిభ ఉన్నవారికే అవకాశాలు రావాలి. ఎవరైతే అర్హులు ఉంటారో వారికే అవకాశాలు దక్కాలన్నారు. మరోవైపు, అవినీతిపైనా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని ప్రచారం చేసేవారిని శిక్షించాలని అన్నారు. అవినీతిని చూసి దేశం కోపగించుకుంటుంది తప్ప అవినీతిపరులను కాదు. ఈ తీరు మారాలి.

అవినీతి చేసిన వ్యక్తులనూ శిక్షించాలన్న భావన ఏర్పడితేనే దేశం వేగంగా పురోగతి సాధిస్తుంది. మన సత్తా అంతా కూడగట్టుకొని అవినీతిపై పోరాడాలన్నారు. ఈ విషయంలో మేం సఫలమయ్యాం. ఆధార్‌, ‌ప్రత్యక్ష నగదు బదిలీ, మొబైల్‌ ‌ఫోన్లు ఉపయోగించి గడిచిన ఎనిమిదేళ్లలో రూ.2లక్షల కోట్ల నల్లధనాన్ని గుర్తించామని మోదీ పేర్కొన్నారు. మహిళలను అందరూ గౌరవించాలని మోదీ దేశ ప్రజలకు సూచించారు. ఏ ఒక్కరూ మహిళల గౌరవం భంగం కలిగేలా ప్రవర్తించ కూడదని హితవు పలికారు. ‘నారీ శక్తి’కి ప్రజలంతా మద్దతు పలకాలని అన్నారు. మహిళలను అవమానించడం సబబేనన్న ప్రవర్తన నుంచి బయటపడాలని స్పష్టం చేశారు. ఇందుకోసం అందరూ ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. ఐక్యభారతం ప్రపంచానికి చాలా నేర్పించాల్సిన అవసరం ఉంది. కుటుంబ నిర్మాణం నుంచే జాతి ఐక్యత ఏర్పడుతుంది. ఐక్య భారతంలో లింగసమానత్వం కీలక అంశం. కుటుంబాలలో కుమారులు, కుమార్తెలకు సమాన ప్రాధాన్యం ఇవ్వకపోతే.. ఐక్యత అనే ఆలోచనే ప్రమాదంలో పడుతుంది. ఇంట్లోనూ ఐక్యభావంతో మెలగాలి. అన్ని స్థాయిలలో వివక్ష పూర్తిగా సమసిపోవాలని మోదీ అన్నారు. మంగళ్‌ ‌పాండే, రాజ్‌ ‌గురు, తాంతీయ తోపే, అష్ఫాకుల్లా ఖాన్‌, ‌రాంప్రసాద్‌ ‌బిస్మల్‌, ‌భగత్‌ ‌సింగ్‌, ‌బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్లు ఆంగ్లేయ పాలకులకు దడ పుట్టించారు.  రాణి లక్ష్మీబాయి, బేగం హజ్రత్‌ ‌మహల్‌ ‌భారత నారీ శక్తి సంకల్పం ఎలా ఉంటుందనేది ప్రపంచానికి చూపించారు. వీరందరినీ గుర్తు చేసుకున్నప్పుడల్లా ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగుతాడని మోడీ చెప్పారు. దేశపు మట్టిపై ఉన్న ప్రేమతో స్వాతంత్య సమర యోధులు వీరోచిత పోరాటం చేసి..మనకు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారని ప్రధాని మోడీ గుర్తుచేశారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్‌కు ఉన్న గొప్ప మహత్తర శక్తి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి మాతృక భారతదేశమన్నారు. 75 ఏళ్లలో మన దేశం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సంకల్పంతో మేం ముందుకు కదులుతున్నాం.

తిరంగా యాత్రల ద్వారా యావత్‌ ‌దేశం ఏకతాటిపైకి వచ్చింది. దేశాన్ని ఏకం చేసే మహత్తర శక్తి మువ్వన్నెల జెండాకు ఉందని ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌కార్యక్రమాలు నిరూపించాయి. ‘సబ్‌ ‌కా సాత్‌.. ‌సబ్‌ ‌కా వికాస్‌’ అని తాము పిలుపునిస్తే.. ‘సబ్‌ ‌కా విశ్వాస్‌.. ‌సబ్‌ ‌కా ప్రయాస్‌’ ‌ద్వారా దేశ ప్రజలంతా తమ ప్రయత్నంలో భాగస్తులయ్యారని మోడీ అన్నారు. ప్రస్తుతం  25 ఏళ్ల వయసు ఉన్న యువత.. మరో 25 ఏళ్ల తర్వాత 50 ఏళ్లకు చేరుతారు. అప్పటిలోగా మన భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సంకల్పంతో యువత పురోగమించాలని మోడీ పిలుపునిచ్చారు. మనం ఏది చేసినా.. ‘ఇండియా ఫస్ట్’ ‌దృక్పథంతో చేయాలి. అప్పుడే దేశంలో, దేశ ప్రజల్లో ఐకమత్య భావన ఏర్పడుతుంది.  స్త్రీ, పురుష సమానత్వం లేనిదే.. సమానత్వ భావనకు పరిపూర్ణత చేకూరదని ఆయన తెలిపారు.  మహిళలను గౌరవించడం అనేది నవ భారత కలలను సాకారం చేసేందుకు పునాదిగా మారుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.