మును‘గోడు’ వినేదెవరు.. గెలిచేదెవరు..?

మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నిక ప్రభావం భవిష్యత్తు ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైనా మునుగోడు నియోజకవర్గంలో తమ జెండా ఎగురవేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో అప్పటినుండే రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి కసరత్తులు మొదలు పెట్టాయి. ఈసారి తమ సత్తా చాటాలని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ చూస్తున్నాయి. తెలంగాణలో మూడోసారి అధికారం తమదే అని గులాబీ దళం ధీమా వ్యక్తం చేస్తోంది. గెలిచి గోల్కొండ కోట మీద జెండా ఎగరేస్తామంటోంది కాషాయ సేన. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ హస్తగతం అవుతుందంటున్నారు కాంగ్రెస్‌ ‌నాయకులు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పీఠం ఎవరికి దక్కబోతోందనే అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ ‌టాపిక్‌గా మారింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువున్నా..
పార్టీలు, నేతల హడావిడి చూస్తే మాత్రం ఈ ఎన్నికలు వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌ ‌గా ప్రతిష్టాత్మకంగా బావిస్తున్నాయి. ఇక తామేమన్నా తక్కువ తిన్నామా అన్నట్లు సర్వే సంస్థలు కూడా ముందస్తుగా జ్యోతిష్యాలు చేప్పేస్తున్నాయి.

ఇటీవలే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించడం…పార్టీ జాతీయ నేతలంతా ఇక్కడకు రావడం ఇక తామేమన్నా తక్కువ తిన్నామా అన్నట్లు సర్వే సంస్థలు కూడా ముందస్తుగా జ్యోతిష్యాలు చేప్పేస్తున్నాయి. ఇటీవలే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించడం…పార్టీ జాతీయ నేతలంతా ఇక్కడకు రావడంతో తెలంగాణా బీజేపీ కార్యకర్తల్లో జోష్‌ ‌కనిపిస్తోంది. ఇక మోదీని ఎదిరించేంది కేసీఆర్‌ ‌మాత్రమే అన్నట్లు జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్‌ ‌చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. మరోవైపు తెలంగాణాలో పీసీసీ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్‌రెడ్డి పార్టీని నిలబెడతానంటూ తొడగొడుతున్నారు. గత శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా మునుగోడు సెగ్మెంట్‌ ‌కేంద్రం గా భారీ సమావేశాలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. రాష్ట్రంలో ఊపందుకున్న రాజకీయ హడావుడి చూస్తుంటే..అన్ని పార్టీలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే పార్టీలు పోటీలు పడి మరీ ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పుతున్నాయి.

ఇతర పార్టీల నుంచి ఎంత ఎక్కువ మంది నాయకులు తమ పార్టీలో చేరితే అంత బలం వచ్చినట్లు ఫీల్‌ అవుతున్నాయి. ఇందులో కొంత  వాస్తవం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుతం తెలంగాణాలో మూడుముక్కలాట జోరుగా నడుస్తోంది. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణాలో దేనికదే తమ పార్టీయే బలమైన శక్తిగా భావిస్తోంది. అయితే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది మాత్రం ఇంకా ఎవరికి అంతు చిక్కడం లేదు.  సామాజిక వర్గాల వారీగా మునుగోడు నియోజకవర్గంలో ఓటుబ్యాంకు అధ్యయనం చేస్తున్న రాజకీయ పార్టీలు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు? ఎవరి ఓట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి? బీసీల ఓట్లు ఎన్ని? ఎస్సీ ఎస్టీల ఓటుబ్యాంకు ఎంత? అభ్యర్థిగా ఎవరిని నిలబడితే తమ పార్టీ విజయం సాధిస్తుంది? ఏ కమ్యూనిటీకి నియోజకవర్గంలో ప్రాధాన్యత ఉంది? వంటి అనేక అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2లక్షల 20 వేల520 మంది ఉంటే కులాల వారీగా ఎంత మంది ఓటర్లు ఉన్నారు అన్న డేటాను సైతం సేకరించి పని మొదలుపెట్టారు.

మునుగోడులో అత్యధిక ఓటర్లు ఈ కమ్యూనిటీనే. ఈ మూడు కులాల ఓట్లే కీలకం.
మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా గౌడ కులస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. మునుగోడు నియోజకవర్గంలో గౌడ కులస్తులు 35,150 మంది 15.94% ఓటు షేర్‌ ‌కలిగి ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ముదిరాజులు 33, 900 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ముదిరాజు ఓటు పర్సంటేజ్‌ 15.37 ‌శాతంగా ఉంది. ఇక మూడవ స్థానంలో ఎస్సీ మాదిగ కమ్యూనిటీ ఉన్నట్టుగా తెలుస్తోంది మునుగోడు నియోజకవర్గం లో ఎస్సీ మాదిగ ఓటర్లు 25 ,650 మంది ఉన్నారు. ఓటు శాతం 11.6 3 శాతం.

కులాల వారీగా ఓటు బ్యాంకు వివరాలివే..
యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఓటర్లు 21, 360 మంది కాగా వారి ఓటు షేర్‌ 9.69 ‌శాతంగా ఉంది. ఇక పద్మశాలీలు 11, 680 ఉన్నారు. వారి ఓటు శాతం 5.30 శాతంగా ఉంది. ఎస్టి లంబాడి ఎరుకల కులానికి చెందిన ఓటర్లు 10,520 మంది ఉన్నారు. వారి ఓటు శాతం 4.7 శాతంగా ఉంది ఇక ఎస్సీ మాల 10,350 మంది ఓటర్లు, వడ్డెర కమ్యూనిటీ చెందిన 8,350 ఓటర్లు, కుమ్మరి కమ్యూనిటీలో 7,850 మంది ఓటర్లు, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ లో 7,820 ఓటర్లు, రెడ్డి కమ్యూనిటీ లో 7,690 మంది ఓటర్లు, ముస్లింలు 7,650 మంది, కమ్మ 5,680 మంది, ఆర్య వైశ్య కమ్యూనిటీ ఓటర్లు 3,760 మంది, వెలమ ఓటర్లు 2,360 మంది, మున్నూరు కాపు ఓటర్లు 2,350 మంది, ఇతరులు 18,400 మంది ఉన్నారు.

మునుగోడు.. 3 పార్టీలకూ కీలకం
కాంగ్రెస్‌కు ఇది సిట్టింగ్‌ ‌సీటు, కేడర్‌ ‌బలంగా ఉన్న నియోజకవర్గం కూడా.  నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, ఇక్కడ హుజూరాబాద్‌ ‌తరహా ఫలితం పునరావృతం కాకుండా చూడాలన్న కృతనిశ్చయంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్‌ ‌సీటులో గెలవాలని కాంగ్రెస్‌ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. తమ బలం ఏమాత్రం తగ్గలేదని, బీజేపీది వాపే తప్ప బలుపు కాదనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని అధికార టీఆర్‌ఎస్‌ ‌భావిస్తోంది. బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దురహంకారం దునుమాడి ఆ పార్టీ పీచమణిచేలా దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలలో నెగ్గిన మాదిరిగానే అనుబంధ శ్రేణులన్నింటిని సమాయత్తం చేసి హాట్రిక్‌ ‌సాదించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవడంతోపాటు, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది. మును’గోడు’ విని నాడి ఎవరికి చిక్కుతుందోనని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు . అయితే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది మాత్రం ఇంకా ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎలక్షన్ల షెడ్యూల్‌ ‌ప్రకటించి తీర్పు వెలువడే వరకు మునుగోడు ఎన్నిక ప్రతిరోజు రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగానే ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.