నా తమిళ సినిమా మాత్రమే షూటింగ్ జరుపుకుంటోంది: దిల్ రాజు వివరణ

ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమాల చిత్రీకరణలు చేపట్టరాదని ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఫిలిం చాంబర్ నిర్ణయించడం తెలిసిందే. అయితే తమిళ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు(వారిసు), ధనుష్ నటిస్తున్న సార్ అనే చిత్రాల షూటింగ్ లు యథావిధిగా జరిగినట్టు తెలిసింది. షూటింగుల నిలిపివేతపై ఫిలిం ఫెడరేషన్ సభ్యుల్లో గందరగోళం నెలకొన్నందునే కొందరు కార్మికులు సమ్మెకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ పరిణామాలపై కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. తాను నిర్మిస్తున్న తెలుగు చిత్రాలేవీ షూటింగ్ జరుపుకోవడంలేదని స్పష్టం చేశారు. విజయ్ తో తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం మాత్రమే షూటింగ్ జరుపుకుంటోందని వెల్లడించారు. తెలుగు సినిమాల షూటింగులు మాత్రమే నిలిపివేస్తున్నట్టు దిల్ రాజు స్పష్టం చేశారు. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వారిసు అనే ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. ఇది తెలుగులో ‘వారసుడు’గా రూపుదిద్దుకుంటోంది.

Leave A Reply

Your email address will not be published.