షర్మిల ఏపీలో పోటీ చేసుకోవచ్చు కదా..: డీకే అరుణ

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే ఆయన కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. వైయస్ కుటుంబం ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదని, పని చేయలేదని చెప్పారు. తెలంగాణలో సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉందని… ఆంధ్ర వాళ్లు ఎవరూ పార్టీ పెట్టినా తెలంగాణ ప్రజలు ఆదరించరని అన్నారు. షర్మిల ఏపీలోనే పార్టీ పెట్టుకుని, అక్కడే పోటీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారని అడిగారు. 2019 ఎన్నికల్లో షర్మిల ఏపీలో ప్రచారం చేశారని… అప్పడు ఆమె తెలంగాణలో లేరని చెప్పారు. ఏపీలో ఎందుకు పోటీ చేయడం లేదో షర్మిల చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన సందర్భంగా ముంపు మండలాలను ఏపీలో కలిపారని… ఇప్పుడు రాజకీయ కారణలతో ముఖ్యమంత్రి కేసీఆర్ వాటి గురించి మాట్లాడుతున్నారని అరుణ ప్రశ్నించారు. తమను తెలంగాణలో కలపాలని ఆయా మండలాల ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని… ఏపీలో వారికి కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడమే దానికి కారణమని అన్నారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎవరెవరు ఎప్పడు చేరాలనే విషయాన్ని తమ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, జగన్ కు అండర్ స్టాండింగ్ ఉందని… కేవలం ఓట్లు అవసరమైన సందర్భంలో మాత్రమే వాళ్లు వ్యతిరేకిస్తారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.